Mahaa Daily Exclusive

  టెలిగ్రాంలో వచ్చిన మెసేజ్ క్లిక్​ చేశాడు రూ.16.79 లక్షలు హాంఫట్..!

Share

: ఇటీవల కాలంలో సోషల్​మీడియాలో ఎక్కడ చూసినా ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా? అనేవి ఎక్కువగా ట్రెండ్​ అవుతున్నాయి. సగం మంది జనాలు అతిగా ఇలాంటి కంటెంట్​నే చూస్తున్నారు. సోషల్​ మీడియా యాప్స్​ ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​, ఫేస్​బుక్​, స్నాప్​చాట్​ వంటి వాటిల్లో ఎక్కువగా ఇవే కనిపిస్తున్నాయి. మీకు ఈ ప్రొడెక్ట్​ నచ్చితే వెంటనే కింద ఇచ్చిన లింక్​పై క్లిక్​ చేయండి అని రాస్తున్నారు. దానిపై క్లిక్​ చేసిన తర్వాత మన డీటెయిల్స్​ అన్ని ఫిల్​ చేస్తే మొత్తం దోచుకోవడమో లేకపోతే బెదిరించడమో చేస్తున్నారు. ఈ మధ్య తమ ఉత్పత్తులకు లైకులు కొడితే డబ్బులు ఇస్తామంటూ సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అది కూడా ఇంటి వద్ద నుంచే డబ్బులు సంపాదించవచ్చని చెబుతున్నారు. వీటిపట్ల మహిళలు, పిల్లలు, ఉద్యోగం చేయలేని వాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వారి ఆసరాను అవకాశంగా తీసుకొని సైబర్​ నేరగాళ్లు వారి వద్ద నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఇలా తాజాగా ఆదిలాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి ఏకంగా రూ.16.79 లక్షలు పోగొట్టుకున్నాడు. కాస్త ఆలస్యంగా గుర్తించిన బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది.

ఆదిలాబాద్​ వన్​టౌన్​ సీఐ బి.సునీల్​ కుమార్​ తెలిపిన వివరాల ప్రకారం, ఆదిలాబాద్​కు చెందిన ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగికి తన టెలిగ్రాంలో ఒక సందేశం వచ్చింది. అందులో వచ్చిన సందేశం మేరకు మొదట వారి ఉత్పత్తులకు లైకులు కొట్టాడు. దీంతో అతడి ఖాతాకు మొదట రూ.10 వేల నగదు వచ్చి చేరింది. దీంతో ఆ వ్యక్తి ఆనందించాడు. ఈసారి పెట్టుబడి రెండింతలు, మూడింతలు లాభం వస్తాయంటూ సందేశాలు వచ్చాయి. దీంతో అవి నిజమేనని నమ్మి ఈ నెల 24 నుంచి 26 వరకు విడతల వారీగా 13 సార్లు నగదును జమ చేస్తూ వెళ్లాడు. ఇలా జమ చేసిన తర్వాత కూడా అతడికి అటువైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన సాఫ్ట్​వేర్​ ఉద్యోగి, వన్​టౌన్​ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్​ నేరగాళ్లు పలు రకాలుగా మోసాలకు పాల్పడుతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. పోలీసుల సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉంటే సైబర్ నేరాలు తగ్గుతాయని సూచించారు.