మా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ బేశుక్ గా ఉందని, మేమిద్దరం కలిసి జోడేడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన ఉగాది వేడుకల సందర్భంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
మా మిత్రులు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితులు పంచిన ఉగాది ప్రసాదంలాగా షడ్రుచులతో ఉన్నదని వర్ణించారు. తీపి, పులుపు , కారం కాస్త ఉప్పు కూడా ఉంది ఎందుకంటే కొన్ని అంశాల్లో నియంత్రణ మరికొన్ని అంశాల్లో వారు చాలా లిబరల్ గా ముందుకు వచ్చారని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారం అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలను వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని అదేవిధంగా పేదలకు వైద్యం అందించాలని నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్య, వైద్యం, పరిశ్రమలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు అత్యధిక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. నేను మా ఉప ముఖ్యమంత్రి జోడెడ్ల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం
ప్రపంచ స్థాయిలో హైదరాబాద్కు గుర్తింపు తీసుకురావాలని యత్నిస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని, దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి యత్నిస్తున్నట్లు చెప్పారు. ఫ్యూచర్ సిటీ ప్రజలు నివసించే నగరమే కాదని, పెట్టుబడుల నగరమని, లక్షలాది మందికి ఉపాధి కల్పించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉంటుందని తెలిపారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవన్నారు. ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని అభిప్రాయపడ్డారు.
అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా
శ్రీమంతుల మాదిరే పేదలూ సన్నబియ్యం తినాలని ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో గతేడాది 1.56 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంత భారీగా ఉత్పత్తి జరగలేదని తెలిపారు. సన్న బియ్యం పండిస్తే బోనస్ కూడా ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 60 నుంచి 65 శాతం మంది సన్నబియ్యం పండిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.








