హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ‘ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే, వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు…కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?‘ అంటూ మండిపడ్డారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ను కలిసిన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీ చూసి బాధపడని వాళ్లు లేరన్నారు. ప్రతి ఒక్కరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయని, కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేనట్లుందన్నారు. యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేయడం తప్పా అని ప్రశ్నించారు. ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా? రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా? లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది? వాళ్లంతా విద్య గురించి మాట్లాడేవాళ్లు కదా? కమ్యూనిస్టు భావజాలంతో కొట్లాడతామని చెప్పుకుంటారు కదా? మరి వాళ్ల నోళ్లెందుకు మూతపడ్డాయి? వేల కోట్లకు భూములమ్మితే మీకు కూడా కమీషన్లు వస్తున్నాయని మౌనంగా ఉన్నారా? స్పష్టం చేయాలన్నారు. హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు.
సన్నబియ్యం కార్యక్రమంలో ప్రధాని ఫోటో ఏది?
రేషన్ బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన క్లారిటీ ఇవ్వాలన్నారు. సన్నబియ్యం విషయంలో మొత్తం ఖర్చు ఎంత? అందులో కేంద్ర, రాష్ట్ర వాటా ఎంతో స్పష్టం చేయాలన్నారు. ఈ బియ్యం విషయంలో ఏటా నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.10 వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తోందని, కిలోకు రూ.40 చొప్పున ఖర్చు చేస్తోందని వివరించారు. వడ్ల కొనుగోలు మొదలు, రవాణా, మిల్లింగ్, సుతిలీ తాడు ఛార్జీలన్నీ భరించేది కేంద్రమేనని, ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కోసం అప్పు తీసుకొస్తే వడ్డీతోసహా పైసలన్నీ చెల్లించేది కేంద్రమే అని పేర్కొన్నారు. సన్న బియ్యం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10లు మాత్రమే భరిస్తోందని, మహా అంటే రూ.2 వేల కోట్లకుపైగా భారం పడుతోందని వివరించారు. ఈ లెక్కన రూ.10 వేల కోట్లకు పైగా చెల్లిస్తున్న మోదీ ప్రభుత్వం గొప్పదా? 2 వేల కోట్లకుపైగా భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గొప్పదా? ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. కేంద్రం ఇంత చేస్తున్నా నిన్న జరిగిన కార్యక్రమంలో ఈ విషయాన్ని ఒక్క సారైనా చెప్పారా? ప్రధానమంత్రికి కనీసం థ్యాంక్స్ చెప్పరా? అసలు ప్రధాని ఫోటో పెట్టకపోవడం ఎంత వరకు కరెక్ట్? సీఎం ఫోటో పెట్టడంలో తప్పు లేదు, కానీ ప్రధాని ఫోటో ఎందుకు పెట్టడం లేదన్నదే మా ప్రశ్న అని నిలదీశారు.
కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ లు ఏకమవుతున్నాయి
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలన్నీ ఒక్కటి కాబోతున్నారు. మజ్లిస్ అభ్యర్ధిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని, ఇప్పటికే డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఈ రెండు పార్టీలు కలిసే హాజరయ్యాయని సంజయ్ పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లు రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని, ఎవరిని పిలవాలో కలిసే డిసైడ్ చేస్తున్నాయన్నారు. అట్లాగే జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే ఎంఐఎం అభ్యర్ధికి మద్దతిస్తున్నాయని, నిజానికి బీఆర్ఎస్ కు ఈ ఎన్నికల్లో అత్యధికంగా 70కిపైగా ఓట్లున్నాయి. అయినా పోటీ చేయడం లేదు, కాంగ్రెస్ కూడా అంతే మజ్లిస్ ను గెలిపించేందుకు సిద్దమయ్యాయన్నారు. ఈ మూడు పార్టీలు ఒక్కటే అనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ లేదన్నారు. రెండు పార్టీలు కలిసి హైదరాబాద్ ను, తెలంగాణను మజ్లిస్ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోందన్నారు., ఈ విషయంపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో అందరి అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు.
గందరగోళంగా గ్రూప్ 1 పరీక్షలు
గ్రూప్ 1 పరీక్షలంతా గందరగోళంగా ఉందని, గతంలో బీఆర్ఎస్ హయంలో గ్రూప్ 1 పరీక్ష లీక్ అయ్యింది, కాంగ్రెస్ పాలనలో గ్రూప్ 1పై అభ్యర్థులు అనేక అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. మెరిట్ విద్యార్థులకు అన్యాయం జరగకుండా న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.








