హెచ్ సీయూ భూముల వివాదం అగ్గి రాజేస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందించారు. విద్యాసంస్థలకు కేటాయించిన భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం అన్యాయమని ప్రకాష్ రాజ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. హెచ్‌సీయూ పరిధిలో ఉన్న 400 ఎకరాల భూములను ఇతర ప్రయోజనాల కోసం వినియోగించాలన్న రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యార్థులు, మేధావులు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ భూములను వాణిజ్య అవసరాలకు ఉపయోగించాలనే ఆలోచనలో ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా స్పందించిన ప్రకాష్ రాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“ఈ విధ్వంసం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు, ఇది మంచిది కాదు.. ఇలాంటి దారుణమైన చర్యకు వ్యతిరేకంగా నేను విద్యార్థులు, పౌరులకు మద్దతు ఇస్తున్నాను. మన భవిష్యత్తు కోసం ఈ నిరసనను షేర్ చేసి విస్తృతం చేయాలని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను.” అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ తెలిపారు. “విద్యాసంస్థల భూములు ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే సాధనాలు. వాటిని వ్యాపార అవసరాల కోసం తాకట్టు పెట్టడం అత్యంత దౌర్భాగ్యమైన పరిణామం. ఇది తక్షణమే ఆగాలి. విద్యార్ధుల హక్కులను హరిస్తే, భవిష్యత్ తరం ప్రశ్నించకుండా ఉండదు. ఇలాంటి నిర్ణయాలు విద్యా వ్యవస్థ మీద నమ్మకాన్ని దెబ్బతీస్తాయి,” అంటూ మరో పోస్ట్‌లో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.








