ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర కార్మిక, ఉపాధి, క్రీడా వ్యవహారాల శాఖ మంత్రి మన్సూక్ మాండవీయను కోరారు. ఈరోజు ఉదయం ఇదే అంశంపై ఢిల్లీకి విచ్చేసిన కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, శాతవాహన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేశ్ కుమార్ లతో కలిసి బండి సంజయ్ కేంద్ర మంత్రి మాండవీయను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్బంగా సంజయ్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలోని అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన కరీంనగర్ విద్య, క్రీడల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. అందులో భాగంగా కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్, వైద్య కళాశాలలతోపాటు ఇతర విద్యాసంస్థలున్నాయి. ముఖ్యంగా క్రీడల్లో కరీంనగర్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అర్జున అవార్డు గ్రహీత మడాసు శ్రీనివాసరావు కరీంనగర్‌కు చెందినవారే. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఖేలో ఇండియా లేదా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇతర పథకాల ద్వారా కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం అభివ్రుద్ధికి తగిన నిధులు మంజూరు చేయాలి.’’అని కోరారు.
ఈ సందర్భంగా సునీల్ రావుతో కలిసి అంబేద్కర్ స్టేడియంలోని క్రీడా సదుపాయాలను వివరించారు. ‘‘1986లో 22.20 ఎకరాల భూమి బహుళ ప్రయోజన ఈ క్రీడా స్టేడియం కోసం కేటాయించారు.1998-2000 మధ్య ఎంపీ లాడ్స్, సింగరేణి కాలరీస్, ఎన్టీపీసీ, ఇతర ప్రైవేట్ సంస్థల సహకారంతో లెవెలింగ్, గ్యాలరీలు, 8-లేన్ 400 మీటర్ల అథ్లెటిక్స్ ట్రాక్ వంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అయితే రోజురోజుకూ అథ్లెట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుత మట్టి ట్రాక్ కారణంగా అనేక మంది గాయాల బారిన పడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిని ద్రుష్టిలో ఉంచుకుని అంబేద్కర్ స్టేడియం అభివృద్ధిలో భాగంగా ‘‘ 8-లేన్ సింథటిక్ అథ్లెటిక్స్ ట్రాక్ వల్ల మట్టి ట్రాక్ స్థానంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయండి. అట్లాగే అథ్లెట్లు రాత్రి వేళల్లో కూడా సాధన చేసేందుకు ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలి. దీంతోపాటు పోటీలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ఓపెన్ గ్యాలరీ(10)ల్లో క్రీడాకారులు, ప్రేక్షకులకు రక్షణ లేకుండా ఇబ్బంది కలిగిస్తున్నందున గ్యాలరీలపై తగిన (కెనోపీ) ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలి.’’అని కోరారు. తద్వారా కరీంనగర్ అథ్లెట్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసి దేశానికి గౌరవం తీసుకురావడానికి అనేక అవకాశాలున్నాయని పేర్కొన్నారు.








