బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో ఉమ్మడి మెదక్ , సంగారెడ్డి , సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతల తో సమావేశం అయ్యారు. కేటీఆర్ , హరీష్ రావు తో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలన్నారు. తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి.. ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.








