అనేక వివాదాలు చుట్టుముట్టిన మలయాళం చిత్రం ఎల్ 2-ఎంపురాన్ నిర్మాత గోకులం గోపాలన్ ఇంట్లో తనిఖీలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోటిన్నర రూపాయలను స్వాధీనం చేసుకుంది. అలాగే ఎంపురాన్ సినిమా డైరెక్టర్, నటుడు అయిన పృథ్వీరాజ్‌కు కూడా నోటీసులు జారీ చేసింది. శ్రీగోపాలన్ చిట్ అండ్ ఫైనాన్స్‌లో ఆర్థిక అవకతవలు జరిగాయన్న ఆరోపణలపై ఎంపురాన్ నిర్మాతపై ఫెమా చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈడీ అధికారులు కేరళ, తమిళనాడులోని గోపాలన్ ఆస్తుల వద్ద రెండు రోజులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కోటిన్నర నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎల్ 2 ఎంపురాన్ చిత్రాన్ని తెరకెక్కించడం వల్లే గోపాలన్‌పై అక్రమ కేసులు పెట్టి కేంద్రం వేధిస్తోందని కేరళలో అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌తో పాటు యూడీఎఫ్ ఆరోపిస్తున్నాయి. కేరళ సాంస్కృతిక రంగం, కళాత్మక స్వేచ్ఛతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛపై బీజేపీ దాడి చేస్తోందని దుయ్యబట్టాయి.
ఏమిటి ఈ వివాదం?
ఎల్2 ఎంపురాన్ చిత్రంలో గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలు ఉండటంపై వివాదాలు చెలరేగాయి. చిత్రంపై బీజేపీ, ఆరెస్సెస్ వంటివి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనితో చిత్రబృందం ఇప్పటికే క్షమాపణలు చెప్పింది. రాజకీయ వివాదాలకు సంబంధించిన సన్నివేశాలు తొలగిస్తామని స్పష్టం చేసింది. ఐతే కేరళ సీఎం సహా చాలా మంది విపక్ష నేతలు ఈ సినిమాకు మద్దతుగా నిలివడం గమనార్హం.








