ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఈ మేరకు స్టాండింగ్ కమిటీ, అడ్వకేట్ జనరల్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), అపెక్స్ కౌన్సిల్, గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ), కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) నుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగే విధంగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తే చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోమని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం నుండి అక్రమంగా నిధులు తెచ్చి, నిర్మాణ పనులు తిరిగి ప్రారంభించనుంది. చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాడని, బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రజల తరుపున పోరాడి తీరుతామని ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.








