పార్టీ కోసం నిరంతరం కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాల అసత్యాలను, అవాస్తవాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. యూత్ కాంగ్రెస్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశం శనివారం అధ్యక్షులు శివ చరణ్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసీ సభ్యులు సంపత్ కుమార్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ యూత్ కాంగ్రెస్ కార్యనిర్వహక సమావేశం కుటుంబ సమావేశంలా ఉందన్నారు. 10 ఏళ్ళ పాలనలో కేసిఆర్ రాష్ట్రాన్ని ఆర్ధిక విధ్వంసం సృష్టించారని, ఫలితంగా ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు ఎదురవుతున్నాయన్నారు. అయినప్పటికీ వాటన్నింటినీ శమర్థవంతంగా ఎదుర్కుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ అభివృద్ధిపై ప్రచారంలో యూత్ కాంగ్రెస్ పాత్ర అనుకున్నంతాగ లేదని పెదవి విరిచారు. సోషల్ మీడియాలో యూత్ కాంగ్రెస్ అగ్రెసివ్ గా వెళ్లాల్సిన అవసరం ఉందని మహేష్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాపై యూత్ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ చేయాలని సూచించారు. యూత్ కాంగ్రెస్ నేతలు సైనికులంటూ ప్రభుత్వాభివృద్ధిపై ప్రచారంలో క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకం అవ్వాలన్నారు. లోకల్ బాడీలో రాణించాలంటే ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సిన అవసరం ఉందన్నారు. జై బాపు, జై భీమ్ ,జై సంవిధాన్ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. రాజీవ్ యువ వికాసంపై యువతలో యూత్ కాంగ్రెస్ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కుల గణన నిర్వహించి ఆదర్శంగా నిలిచామన్నారు. హెచ్ సీయూ భూములపై ప్రతి పక్షాలు ఏఐ టెక్నాలజీతో అసత్యాలను అనైతికంగా సోషల్ మీడియాలో ప్రచారం చేశాయని, ఇలాంటి వాటిపై యూత్ కాంగ్రెస్ వెంటనే రెన్పాన్డ్ కావాల్సిన అవసరం ఉందని వివరించారు. హెచ్ సీయూ భూములపై వాస్తవికతను తెలియజేయాలని కోరారు.








