కృష్ణా జలాశయాలలో తెలంగాణాకు జరుగుతున్న అన్యాయంపై కృష్ణా ట్రిబ్యునల్ -2 ముందు తానే స్వయంగా హాజరై తెలంగాణా తరపున వాదనలు వినిపించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కృష్ణా,గోదావరి జలాశయాలలో తెలంగాణా కేటాయింపులకై న్యాయస్థానలలో రాష్ట్రం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల బృందానికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయం జలసౌధలో నీటిపారుదల శాఖాధికారులతో పాటు న్యాయవాదుల ప్రతినిధుల బృందంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర నీటిపారుదల సలహాదారు ఆదిత్యా దాస్ నాధ్,ఇ.ఎన్.సి లు అనిల్ కుమార్,విజయ భాస్కర్ రెడ్డి,సీనియర్ న్యాయవాది సి.ఎస్.వైద్య నాథన్ తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఇంతకు ముందు కృష్ణా ట్రిబ్యునల్ 2 ఎదుట జరిగిన వాదనలను పూర్తిగా సమీక్షించడంతో పాటు ఏప్రిల్ 15,16 తేదీలలో ట్రిబ్యునల్ ముందు లెవనెత్తాల్సిన అంశాలపై సమగ్రంగా చర్చించి ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకున్నారు.
2014 ఆంద్రప్రదేశ్ పునర్విభజన అనంతరం కృష్ణా జలాశయాలలో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి,న్యాయబద్ధంగా తెలంగాణా రావాల్సిన నీటి కేటాయింపులు వంటి అంశాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పూర్తి స్థాయిలో వివరించారు.
అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ న్యాయబద్దంగా తెలంగాణాకు రావాల్సిన నీటి కేటాయింపులపై బలమైన వాదనలు వినిపించేందుకు మార్గదర్శనం చేశారు.
దశాబ్దాలుగా సాగునీటి మీద ఆధారపడి సేద్యం చేస్తున్న రైతాంగం నీటి కొరతతో ఆత్మక్షోభకు గురయ్యారని అటువంటి అన్యాయలను సరిదిద్డేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు
అదే సమయంలో కృష్ణా ట్రిబ్యునల్ 2 ముందు వాదనలకు అవసరమైన సమగ్రమైన సమాచారాన్ని అందించడంతో పాటు ఢిల్లీలో ఉన్న బృందంతో సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ చెయ్యాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు
అంతే గాకుండా రాష్ట్రానికి సంబంధించిన వరకు వివిధ న్యాయ స్థానాలలో పెండింగ్ లో ఉన్న కేసులు,అప్పీల్స్ వాటి వాటి ప్రస్తుత స్థితి ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని ఆయన అధికారులకు సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించెందికు ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.








