విద్యార్థులతో ఇంటర్ బోర్డు చెలగాటం ఆడుతోందా? గతంలో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకోవడం లేదా? అంటే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం తీరు ఇదే విషయం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలోని పలు స్పాట్ కేంద్రాల్లో ఒక్కో ఎగ్జామినర్ రోజుకు 30కి బదులు 45-60 జవాబు పత్రాలు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీని ఫలితంగా విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగుతోందని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మార్చి 10 నుంచి విడతల వారీగా ఇంటర్ మూల్యాంకనం మొదలైంది. ఎగ్జామినర్ ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష పేపర్లను దిద్దాలి. ఈ క్రమంలో మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఉంటుంది. అంటే ఒక ఎగ్జామినర్ ప్రతి 12 నిమిషాలకు ఒకటి చొప్పున గంటకు ఐదు.. అలా 30 ఆన్సర్ షీట్లను దిద్దాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్కో ఎగ్జామినర్‌కు రోజూ 45 ప్రశ్నాపత్రాలను ఇస్తున్నారు. ఇందులో రసాయన శాస్త్రంలో 60 ఇస్తున్నారు. అన్ని పేపర్లు సక్రమంగా చూసి దిద్దడం చాలా కష్టంగా మారిందని ఇది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటమే అని వరంగల్ ఎల్బీ కళాశాలలో స్పాట్‌కు హాజరవుతున్న ఒక అధ్యాపకుడు తెలిపారు.
10వ తేదీకి పూర్తయ్యేలా..
ఇలా రోజుకు 60 పేపర్లు ఇస్తే గంటకు 10 పేపర్లు దిద్దాల్సి వస్తోంది. 24 పేజీల బుక్‌లెట్‌లోని జవాబులను పరిశీలించి, మార్కులు వేసి, మొత్తం లెక్కించే ప్రక్రియ కేవలం సగటున ఆరు నిమిషాల్లోనే ముగించాల్సి ఉంటుంది. అదీ ఒక్క నిమిషం కూడా తేడా లేకుండా ఠంచన్‌గా 10 గంటలు కూర్చుంటేనే అది సాధ్యం. ఒక్కసారి కూడా మూత్ర విసర్జనకు వెళ్లకుండా, టీ తాగకుండా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఇలా ఎక్కడైనా సాధ్యమేనా అనేది ప్రశ్నార్థకం. ఆంగ్లం సబ్జెక్టు మూల్యాంకం ఏప్రిల్ 4న ముగిసింది. అయితే 8న రిలీవ్ అయినట్లుగా అందులో చూపుతూ ఉత్తర్వు కాపీలను ఇచ్చారు. అంటే నాలుగు రోజులు అదనంగా దిద్దాల్సిన మూల్యాంకన పేపర్లను ముందుగానే బలవంతంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 10వ తేదీకి రాష్ట్రంలోని 19 కేంద్రాల్లో మూల్యాంకనం పూర్తి కానుంది.








