Mahaa Daily Exclusive

  శ్రీరాముడికి ముస్లిం మహిళలు హారతి 19 ఏళ్ళుగా వారణాసిలోని ముస్లిం మహిళల హారతి..!

Share

శ్రీరామ నవమి పర్వదినాన ముస్లిం మహిళలు అయోధ్య రాముడికి హారతి ఇచ్చి మత సామరస్యాన్ని చాటారు. అనంతరం వక్ఫ్​ సవరణ బిల్లుకు తమ మద్దతు తెలియజేశారు. వారణాసిలోని ముస్లిం ఉమెన్ ఫౌండేషన్, విశాల్​ భారత్​ సంస్థాన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందమైన రంగోలి వేశారు. అయితే ఇలా గత 19 సంవత్సరాలుగా వారణాసిలోని ముస్లిం మహిళలు రామనవమి నాడు శ్రీరాముడికి హారతి ఇస్తుండటం విశేషం. తమ పూర్వీకులు రాముడి భక్తులు, తాము కూడా అంతే అని నజ్నియన్ అన్నారు. “ఈ రోజు మనం వక్ఫ్ బోర్డులో సంస్కరణలతో సంతోషంగా ఉన్నాము. ముస్లిం మహిళలకు హక్కులు లభించాయి. రాముడి పేరు మాత్రమే ఈ వివాదాన్ని అంతం చేస్తుంది. వక్ఫ్ బిల్లు ఆమోదం పొందినందున, ప్రజలు హారతి ఇవ్వడం ద్వారా రాముడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన దయవల్లే అంతా జరిగింది.” అని నజ్నియన్ అన్నారు.

రాముడి పేరుతో ద్వేషం అంతం
రామనవమి మన దేశ సంస్కృతిలో ఒక భాగమని విశాల్ భారత్ సంస్థాన్ కు చెందిన డాక్టర్ నజ్మా పర్వీన్ అన్నారు. శ్రీరాముడి దయవల్ల ముస్లిం మహిళలకు మద్దతుగా ట్రిపుల్ తలాక్ బిల్లు, వక్ఫ్ బిల్లు ఆమోదం పొందాయన్నారు. రామ్‌జీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం వేల సంవత్సరాల సంప్రదాయమని అన్నారు విశాల్ భారత్ సంస్థాన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రాజీవ్. “ప్రతి భారతీయుడు ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ముస్లిం మహిళలు ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచారు. ఇది మొత్తం ప్రపంచానికి ఐక్యత, ప్రేమ, సద్భావన సందేశాన్ని పంపుతుంది. ఇది నేటి తరానికి అవసరం. రాముడి పేరుతో ద్వేషాన్ని నిర్మూలించవచ్చు. ప్రతి దేశం పాఠ్యాంశాల్లో శ్రీ రామచరితమానస్‌ను చేర్చాలి” అని అన్నారు.