Mahaa Daily Exclusive

  కన్నుల పండువగా శ్రీరాముడి శోభాయాత్ర..!

Share

శ్రీరామ నవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ మహానగరంలో శ్రీరాముడి శోభాయాత్ర వైభవంగా జరిగింది. దూల్‌పేటలో ప్రారంభమైన శోభయాత్ర కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు కొనసాగింది. అంతకు ముందు ర్యాలీని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీతారాంబాగ్ లో జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ఆసాతం జై శ్రీరామ్‌ నినాదాలతో నగర వీధులు మార్మోగిపోయాయి. ఉదయం నుంచి నగరంలోనూ, సివారు ప్రాంతాలలో కాషాయ ధ్వజాలతో ర్యాలీలను నిర్వహించిన వారంతా సీతారాంబాగ్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో చేరడంతో ఇసుకవేసతే రాలనంత జనంతో ర్యాలీ సాగింది. నగరం నలుమూలల నుంచి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్‌ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఈ రమణీయ ఘట్టంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం నగర ప్రజలు మాత్రమే కాకుండా వందల సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రోడ్లన్నీ కాషారంగును పులుముకున్నాయి. శోభాయాత్ర దృష్ట్యా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మొత్తం 6.2 కిలోమీటర్ల మేర శ్రీరాముడి శోభాయాత్ర కొనసాగింది. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 20 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కీలకమైన, సున్నితమైన ప్రాంతాలలో సాయుధ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసిన అధికారులు అనేక చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఊరేగింపు జరుగుతున్న తీరును సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక పోలీసులను నియమించారు. ఊరేగింపు జరుగింది స్వల్ప దూరమే అయినప్పటికీ అనేక సున్నితమైన అంశాలు ఉండటంతో ప్రత్యేక శ్రద్ధను తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీం బృందాలను రంగంలోకి దింపారు.