సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎం.ఎ బేబికి అవకాశం దక్కింది. తమిళనాడులోని మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభల్లో ఆయన్ని పార్టీ సభ్యులు కొత్త సారథిగా ఎన్నుకున్నారు. గతేడాది సీతారం ఏచూరి మృతితో ఆయనకు ఈ పదవి దక్కింది. చూరి మరణానంతరం నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్ వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలోనే మదురైలో జరిగిన సీపీఎం 24వ మహాసభలో 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. నూతన కేంద్ర కమిటీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీని, అలాగే 18 మందితో పొలిట్ బ్యూరోను ఎన్నుకున్నారు. అయితే ఈ కేంద్ర కమిటీలో 20 శాతం మంది మహిళలే ఉండటం మరో విశేషం. సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి రేసులో సీనియర్ నేతలైన ఎం.ఎ.బేబీతో పాటు అశోక్ ధవలే, మహమ్మద్ సలీం, బి.వి.రాఘవులు, బృందా కారాట్ పేర్లు ఎక్కువగా వినిపించాయి. ఆ పార్టీలో ఓ వర్గం ఆలిండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడైన అశోక్ ధవలేకు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉండగా.. 1954లో కేరళలోని ప్రాక్కుళంలో ఎం.ఎ బేబీ జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పి.ఎం.అలెగ్జాండర్, లిల్లీ అలెగ్జాండర్ . బేబీ విద్యార్థి దశలో ఉన్నప్పడే కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఇప్పుడు ఎస్ఎఫ్ఐ)లో చేరారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. కేరళ మంత్రిగా కూడా సేవలు అందించారు. 2012 నుంచి సీపీఎం పొటిల్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.








