దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగిన ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న విశ్వాసంతో బీజేపీని అఖండ మెజార్టీతో గెలిపిస్తున్నారని ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ముషీరాబాద్ డివిజన్ కార్పొరేటర్ సుప్రియ నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో బాపూజీ నగర్ లో పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఇటీవల హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు. దేశ చరిత్రలోనే మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నరేంద్ర మోడీ పట్ల ప్రజలకు ఉన్న నమ్మకంతోనే బీజేపీని గెలిపిస్తున్నారని పేర్కొన్నారు. పేద ముస్లింలకు, మహిళలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో వక్ఫ్ బిల్లును సరిదిద్దడానికి పార్లమెంట్ లో బిల్లును ప్రవేశ పెడితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు బిల్లును వ్యతిరేకించాయని ఆరోపించారు . ఈ రెండు పార్టీలు ఓకే గూటి పక్షులని, కేవలం రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంటులో వక్ఫ్ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించాయని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ నేతలు ఆడే ఆటలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పావులుగా మారారని విమర్శించారు. హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంఐఎం పార్టీ నేతలు హైదరాబాదులో ముస్లింలు పేదరికంలో మగ్గుతున్నారని అందుకు ఎంఐఎం పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేటర్లు అందరూ ఎంఐఎం పార్టీ నేతలే అని మరి పేదరికంలో ఉన్న ముస్లింల అభ్యున్నతికి ఎందుకు కృషి చేయడం లేదని ప్రశ్నించారు.








