కులగణనను తప్పుదోవ పట్టించి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు తాము సిద్ధమని ఆమె ప్రకటించారు. అసెంబ్లీలో జ్యోతిభాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ (యూపీఎఫ్) ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను వెబ్సైట్లో పెట్టామని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. 2011లో యూపీఏ హయాంలో దేశంలో కులగణన చేసినా.. ఇప్పటికీ వివరాలు వెల్లడించలేదని ఆమె విమర్శించారు. బీసీ కులగణన చేయబోమని బీజేపీ స్పష్టం చేసిందని కవిత గుర్తు చేశారు. కాబట్టి ఆ పార్టీపై ఒత్తిడి తేవాలని ఆమె సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో తాము కూడా కలిసి వస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి నిరవధికంగా దీక్షలు చేద్దామని అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాకు రాహుల్ గాంధీ వస్తారని కాంగ్రెస్ శ్రేణలు ఊదరగొట్టాయని.. కానీ ధర్నాకు ఆయన రాలేదని కవిత ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగులో మాట్లాడారని కవిత విమర్శించారు. ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి తేవాలంటే వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలని హితవు పలికారు. ఏప్రిల్ 11లోగా రాష్ట్రంలో పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.
చట్టసభలో బిల్లులు ఆమోదించి నాలుగు వారాలైందని, ప్రస్తుతం ఆ బిల్లుల స్థితి ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వద్దనే పెండింగ్ లో ఉన్నాయా… లేదా రాష్ట్రపతికి పంపించారా ? తెలపాలన్నారు. బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అన్ని పార్టీలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని సీఎం అన్నారు.కానీ ఇప్పటి వరకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లలేదన్నారు. బీజేపీతో సీఎం రేవంత్ రెడ్డికి లాలూచి లేకుంటే ప్రధాని అపాయింట్ మెంట్ లభించేదని కవిత అన్నారు. బీజేపీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం లేదని, దానికి బదులు ఢిల్లీలో తుఫేల్ ధర్నా చేశారని ఎగతాళి చేశారు. కులగణన అధ్యయనం పూర్తి చేసే వరకు మనం మాట్లాడవద్దని స్వతంత్ర అధ్యయన సంస్థ హెచ్చరిక చెబుతోంది. మీరెవరు మాకు హెచ్చరిక చేయడానికి, చిత్తశుద్ధి ఉంటే కులగణన నివేదికను అసెంబ్లీలో పెట్టండని నిలదీశారు. ఏప్రిల్ 11లోగా పూలే విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేయాలన్నారు. దేశంలో తరతరాలుగా వెనుకబడ్డ జాతులకు న్యాయం జరగాలని కాంక్షించిన వ్యక్తి పూలే అని, పూలే తనకు గురువు అని అంబేద్కర్ చెప్పారన్నారు. మహిళల కోసం పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పూలే అని, కులవివక్షకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. అసెంబ్లీలో పూలే విగ్రహం పెడితే సమాజం స్పూర్తి పొందుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా విగ్రహం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ధైర్యంగా ముందుకే వెళ్తాము తప్పా… వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులు పెట్టాలని డిమాండ్ చేసి సాధించామని, ఇది తెలంగాణ జాగృతి, యూపీఎఫ్, బీఆర్ఎస్ పార్టీ విజయమని కవిత స్పష్టం చేశారు.








