దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రంగా తెలంగాణాకు దక్కిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. కేంద్రం సరఫరా చేసేది ఇప్పటికీ దొడ్డు బియ్యమేనని, అది కుడా కొందరికే పరిమితమని ఆయన స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం చారిత్రత్మక నిర్ణయం తీసుకోని అమలులోకి తెచ్చాక కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న దొడ్డు బియ్యం స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని 20 శాతం అదనంగా వెచ్చించి అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. గురువారం మధ్యాహ్నం జలసౌధ నుండి ఆయన లోకసభ ,శాసనసభ,శాసన మండలి, కార్పొరేషన్ చైర్మన్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఇంతకు మించిన సంక్షేమ కార్యక్రమం మరోటి ఉండబోదన్నారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావడమే కాకుండా సన్న బియ్యం లబ్ధిదారులతో కలసి భోజనం చేయాలని, తద్వారా పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రత్యేక దృష్టిని ప్రజలు గుర్తిస్తారని ఆయన ప్రజాప్రతినిధులకు ఉద్బోధించారు. ప్రతి లబ్దిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున అందిస్తున్న సన్నబియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 13 వేల కోట్లు ఖర్చు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకు పోవాలని సూచించారు. ఏటా మూడు కోట్ల 10 లక్షల మందికి ఉచితంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం సరఫరా చేయలని నిర్ణయించామన్నారు. సన్నబియ్యం సరఫరాకు ముందు కేంద్రం, రాష్ట్రం కలిపి 10,665 కోట్లు ఖర్చు చేసి పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం పక్కదోవ పట్టి అనేక అక్రమాలకు తెర లేవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి అంకురార్పణ చుట్టిందన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా 2,858 కోట్లు భారం పడినా సంవత్సరానికి మొత్తంగా 8,033 కోట్లు ఖర్చు పెట్టి ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నామన్నారు.
అదే సమయంలో సన్న బియ్యం పంపిణీలో కేంద్రం పాత్ర ఉందంటూ విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజాప్రతినిధులు ముక్తకంఠంతో తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డుల మంజూరు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. లబ్ధిదారుల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని త్వరితగతిన పరిశీలన జరిపి తెల్ల రేషన్ కార్డులు అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణా ఆవిర్భావ సమయంలో 89.73 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆ ప్రభుత్వం మంజూరు చేసింది కేవలం 49,479 తెల్ల కార్డులేనని ఆయన ఎద్దేవా చేశారు. అంతే కాదు కనీసం ఉన్న రేషన్ కార్డులలో కొత్త సభ్యులని చేర్పించడంలోను బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారుల నుండి 30 లక్షల దరఖాస్తులు స్వీకరించామన్నారు. లబ్దిదారుల సంఖ్య 2 కోట్ల 81 లక్షల నుండి 3 కోట్ల 10 లక్షలకు పెరగవచ్చని ఆయన తెలిపారు. పెరుగుతున్న లబ్దిదారులకు సరిపడా సన్న బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. బీఆర్ఎస్ పాలనలో కట్టిన కాళేశ్వరం కూలి పోయినా మెడిగడ్డ పని చేయక పోయిన రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్ లో కలిపి 123.27 లక్షల ఎకరాలలో 281 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పట్ల అనుసరించిన విధానాలే కారణమన్నారు.
ఖరీఫ్ లో 66.78 లక్షల ఎకరాలలో 153.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయితే రబీలో సాగు చేసిన 56.49 లక్షల ఎకరాలలో 127.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని అంచనా వేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.41 లక్షల మంది రైతుల నుండి 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,199 కోట్లు బోనస్ రూపంలో చెల్లించామన్నారు. రబీ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు గాను 8,209 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ధాన్యం కొనుగోలులో ఆయా జిల్లాల కలెక్టర్ లకు పూర్తి స్థాయిలో అధికారం ఇచ్చామని అదనంగా ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఆవశ్యకత ఉన్న చోట ప్రజాప్రతినిధులు ఆయా కలెక్టర్ లతో సంప్రదించి ఏర్పాటు చేసుకోవచ్చాన్నారు. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో 17 శాతానికి మించి ఉంటే అంగీకరించే ప్రసక్తి లేదని ఇది జాతీయ విధానమన్నారు. అదే సమయంలో 25 శాతానికి మించి నూకలు ఉన్న బియ్యం సరఫరా చేస్తే రైస్ మిల్లర్లపై చర్యలు కఠినంగా ఉంటాయని మంత్రి హెచ్చరించారు.








