రాష్ట్రంలో డిజిటల్ సేవల విస్తరణపై ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, కంప్యూటర్ సేవలను తక్కువ ధరలో అందించేందుకు ప్రభుత్వం నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న టీ – ఫైబర్ సేవలను మరింత విస్తరించి, నూతన సర్వీసులు జత చేస్తూ టీ – ఎన్ఎక్స్ టీగా ఆవిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, చివరి గ్రామం, చివరి ఇంటి వరకు ఫైబర్ కనెక్టివిటీ చేర్చే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమం వచ్చే ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందని చెప్పారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా నడుస్తోందని, అక్కడ ప్రజలు ఎంతో హర్షిస్తున్నారని చెప్పారు.
ప్రతి ఇంటిలో స్మార్ట్ టీవీ ద్వారా టెలిఫోన్, కంప్యూటర్ సదుపాయాలు లభించేలా తయారు చేస్తున్నారని, ఇది విద్య, సమాచారం పరంగా ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారనుందని వివరించారు. ఇప్పటివరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 43,000 కిలోమీటర్ల ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్‌గా నిలవనుందని మంత్రి పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి, పెద్ద తరగతి ప్రజలందరికీ సమానంగా సేవలు అందించాలన్నదే మా ధ్యేయమని, ఫింగర్టిప్లో సమాచారం ఉండేలా సాంకేతిక వనరులు అందిస్తున్నామన్నారు. ఇవన్నీ అతి తక్కువ ధరకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా 2013లో యూపీఏ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ద్వారా గ్రామాల్లో ఫైబర్ నెట్వర్క్ ఇవ్వాలని ప్రారంభించిందని, రాష్ట్ర విభజన తరువాత గత ప్రభుత్వం దీన్ని కొనసాగించిందన్నారు. ఇప్పుడు మేము దీనిని పూర్తి చేయబోతున్నామన్నారు. మా ప్రభుత్వానికి సంవత్సరం నాలుగు నెలలు పూర్తవుతున్న ఈ సమయంలో, మిగిలిన 40 శాతం పనులు పూర్తి చేశామని, మిగిలినవన్నీ సమయానుకూలంగా పూర్తి చేస్తామన్నారు.








