Mahaa Daily Exclusive

  పేదోడి కడుపునింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…!

Share

పేదోడి కడుపునింపడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, సన్నబియ్యం పథకం దేశంలోనే విప్లవాత్మకమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం పినపాక నియోజకవర్గంలోని భూర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు, పినపాక మండలాలలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మణుగూరు మండలంలోని ప్రజా భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వం లక్షమన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందజేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. అంతేగాక పేదలకు 500లకే గ్యాస్ సిలిండర్ అమలు చేస్తామని తెలిపారు. రైతులకు 2లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. అలాగే గృహ జ్యోతి పథకం కింద పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానిదన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఉపయోగపడుతున్నాయన్నారు. ఇచ్చిన ఆరు పథకాలలో ఒక్కొక్కటిగా నెరవేస్తున్నామన్నారు. నిజానికి రాష్ట్రం డబ్బు లేకపోయినా ఏదో విధంగా కష్టపడి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. గత 10 ఏండ్లు పరిపాలించిన దొరవారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పోయారని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం పేరుతో లక్షల కోట్ల రూపాయలు మింగేశారని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మించి కాళేశ్వరం నీరు ద్వారా ఏ ఒక్క రైతు బాగుపడలేదన్నారు. రైతుని రాజును చేస్తానని చెప్పి రైతుని ఆ కాళేశ్వరంలో ముంచి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతుకి కష్టాలు రాకుండా చేయడమే ఇందిరమ్మ ప్రథమ లక్ష్యమన్నారు. పినపాక ఏజెన్సీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి నాణ్యమైన బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రాజెక్టు బ్రిడ్జిలకు కొత్తతరహా తెస్తాం అన్నారు. పులుసుబొంతా ప్రాజెక్టును కూడా నిర్మించి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తామన్నారు. ప్రాజెక్టు కింద పోయే పంట పొలాల రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వంపై గత పాలకులు ఎన్ని విమర్శలు చేసిన అవేవి పట్టించుకోకుండా ప్రజలకు ఇచ్చిన హామీల పైనే ఫోకస్ పెట్టామన్నారు. ప్రతి పేదవాడి కుటుంబానికి ఇందిరమ్మ ప్రభుత్వం అండగా ఉంటుందని, మిగిలిన హామీలను కూడా త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. రాజీవ్ వికాస్ పధకాన్ని ప్రతి పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మంత్రి పర్యటనలో ఎంపీ బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్, భద్రాచలం ఐటీడీఏ పీవో బీ.రాహుల్, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, మండల అధ్యక్షుడు నవీన్, , కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయతీ, మిషన్ భగీరథ, విద్యా శాఖ, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.