కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున సంస్థాగత మార్పులకు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లో ఇటీవల ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశం, ఏఐసీసీ ప్లీనరీలో ఈ మేరకు చాలా స్పష్టమైన సందేశాలు ఇచ్చింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ కీలక మార్పులకు కసరత్తు చేస్తోంది. పార్టీ కోసం పనిచేసే వాళ్లు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్లు రిటైర్ కావచ్చు..అంటూ మల్లికార్జున్ ఖర్గే అహ్మదాబాద్ ప్లీనరీలో స్పష్టమైన హెచ్చరికలు సైతం చేశారు. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగా కాంగ్రెస్ వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఎలాంటి కీలక పాత్ర అప్పగించనున్నారనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఉపాధ్యక్ష పదవికి ప్రియాంకను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ నిర్దిష్ట బాధ్యతలు లేవు. అయితే ఇటీవల జిల్లా అధ్యక్షులకు పార్టీలో కీలక పాత్ర ఉంటుందని ఖర్గే ప్రకటించారు. ఇందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించడం వెనుక ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు. జిల్లా అధ్యక్షులకు కాంగ్రెస్ పార్టీ కీలక అధికారాలు అప్పగించాలని నిర్ణయం గుజరాత్‌తోనే ప్రారంభిస్తోంది. జిల్లా స్థాయి నేతలకు అధికారుల ఇవ్వడం ద్వారా పార్టీ అట్టడుగు స్థాయి నుంచి బలపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు గుజరాత్‌లో విజయవంతమైతే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉంది.








