సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. తొలుత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవో విడుదల చేసి మొదటి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందించామన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణపై గతంలో అసెంబ్లీలో అన్ని పార్టీల వారు మాట్లాడారు. కానీ ఏ పార్టీ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లలేదు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ప్రక్రియను వేగవంతం చేశాం. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాం. కొన్ని వేల విజ్ఞప్తులు వచ్చాయి.. వాటిని ఎంతో అధ్యయనం చేశాం’’ అని తెలిపారు. నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చిందని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. దళితుల్లో సామాజిక, ఆర్థిక వ్యత్యాసాలు ఉండకూడదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేసుకున్నామని, కొన్నివేల విజ్ఞప్తులు అందుకుని అధ్యయనం చేశామన్నారు. విద్య, ఉద్యోగాల్లో ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అమలవుతుందని పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని రాజనర్సింహ తెలిపారు.








