గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలని కార్మిక శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించేలా బిల్లు రూపొందించాలన్నారు. గిగ్ వర్కర్ల భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. వారికి బీమా, ఇతర హక్కులు కల్పించేలా బిల్లు ఉండాలన్నారు. బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో పెట్టాలని.. ప్రజల అభిప్రాయాన్ని సేకరించాలని సీఎం ఆదేశించారు. సూచనలను తీసుకొని, వాటిని పరిశీలించి తుది ముసాయిదాను రూపొందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. గిగ్‌వర్కర్ల చట్టంలో కార్మికుల భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. కంపెనీలు, అగ్రిగేటర్లను సమన్వయం చేసేలా కొత్త చట్టం ఉండాలని చెప్పారు. ఈ నెల 25 నాటికి బిల్లు తుది ముసాయిదాను సిద్ధం చేయాలన్నారు. మే డే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలని కార్మిక శాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిగ్ అండ్ ప్లాట్ ఫాం వర్కర్లకు పూర్తి భద్రత కల్పించేలా చట్టం తీసుకు వస్తామని ఇచ్చిన హామీ మేరకు వర్కర్స్ బిల్లును తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం సన్నద్దమైంది. స్విగ్గీ, జొమాటో తదితర వర్కర్లకు ఈ బిల్లు ఎంతో ఉపయుక్తంగా ఉండనున్నది.








