Mahaa Daily Exclusive

  థ్రిల్లర్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ కోల్ కతాను ఖంగుతినిపించిన చాహల్ ఉత్కంఠకు గురిచేసిన లోస్కోరింగ్ మ్యాచ్…!

Share

క్షణం..క్షణం ఉత్కంఠ. లోస్కోరింగ్ మ్యాచ్ లో కోల్ కతాకు చుక్కలు చూపించి పంజాబ్ సూపర్ అనిపించుకుంది. భల్లే ..భల్లే అంటూ విక్టరీని అందుకుంది. ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో భారీ స్కోర్ల మ్యాచ్‌ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా లో స్కోరింగ్ గేమ్‌లోనూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. ముల్ల‌నూర్ వేదికా పంజాబ్ కింగ్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ థ్రిల్ల‌ర్‌ను త‌ల‌పించింది. కొండంత స్కోర్ కొడుతుంద‌నుకున్న పంజాబ్ 15.3 ఓవ‌ర్ల‌కే కుప్ప‌కూల‌గా.. హిట్ట‌ర్ల‌తో నిండి కోల్‌క‌తా ఇన్నింగ్స్ 15.1 ఓవ‌ర్లకే ఆలౌట్ అయింది. 112 ప‌రుగుల ఛేద‌న‌లో య‌జ్వేంద్ర చాహ‌ల్(4-28) విజృంభ‌ణ‌తో అల్లాడిన డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ను ఆండ్రూ ర‌స్సెల్(17) గెలిపించేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాడు. కానీ, యాన్సెన్ అత‌డిని బౌల్డ్ చేసి పంజాబ్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాన్ని అందించాడు.

పంజాబ్ పంజా

ఉప్ప‌ల్ స్టేడియంలో స‌న్‌రైజ‌ర్స్ చేతిలో కంగుతిన్న‌ పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకొని కోల్‌క‌తాకు పెద్ద షాకిచ్చింది. చాహ‌ల్(4-28) విజృంభ‌ణ‌తో ధాటిగా ఆడుతున్న అజింక్యా ర‌హానే(17), అంగ్‌క్రిష్ ర‌ఘువంశీ(37)లు పెవిలియ‌న్ చేరారు. దాంతో,76కే కోల్‌క‌తా 4 వికెట్లు ప‌డ్డాయి. ఆ కాసేప‌టికే మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్ ఎల్బీగా ఔట‌య్యాడు.

చాహ‌ల్ మ్యాజిక్
62తో ప‌టిష్ట స్థితిలో ఉన్న కోల్‌క‌తాను చాహ‌ల్ దెబ్బ‌కొట్టాడు. ర‌హానేను ఎల్బీగా వెన‌క్కి పంపిన అత‌డు కాసేప‌టికే ర‌ఘువంశీని ఔట్ చేసి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. అత‌డి స్పిన్ మాయాజాలంతో రింకూ సింగ్ స్టంపౌట్ కాగా.. ఆ త‌ర్వాత వ‌చ్చిన ర‌మ‌న్‌దీప్ సింగ్ స్లిప్‌లో శ్రేయ‌స్ చేతికి చిక్కాడు. అంతే.. యాన్సెన్ సూప‌ర్ బాల్‌తో హ‌ర్షిత్ రానా()ను బౌల్డ్ చేసి కోల్‌కతాను ఆలౌట్ అంచుల్లోకి నెట్టాడు. అయితే.. చాహ‌ల్ వేసిన 14వ ఓవర్లో ఆండ్రూ ర‌స్సెల్(17) రెండో బంతిని లాంగాఫ్‌లో సిక్స‌ర్‌గా మ‌లిచాడు. అదే ఊపులో 78 మీట‌ర్ల సిక్స‌ర్, ఫోర్‌తో 16 ర‌న్స్ సాధించాడు. ఆ త‌ర్వాత అర్ష్‌దీప్ ఓవ‌ర్లో వైభవ్ అరోరా(0) ఆఖ‌రి బంతికి వికెట్ కీప‌ర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయినా ర‌స్సెల్ ఉన్నాడ‌నే భ‌రోసాతో ఉన్న కోల్‌కతా ఆశ‌ల్ని ఆవిరి చేస్తూ యాన్సెన్ తొలి బంతికే బౌల్డ్ చేశాడు. అంతే.. 16 ప‌రుగుల తేడాతో పంజాబ్ సూప‌ర్ విక్టరీని సొంతం చేసుకుంది.