బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఒక్కసారిగా మండిపడింది. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని , అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే భరిస్తామంటున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మంగళవారం విరుచుకుపడగా, కూలడం పక్కా అంటూ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. తనపై మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. దుబ్బాక ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని పడగొట్టాలనే యత్నాన్ని కుట్రకోణంగా భావిస్తున్నామని విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని సీఎంను కోరుతామన్నారు. కుట్ర కోణం ఉన్నట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈర్ష్య ఎందుకని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నారని, మరో ఐదేళ్లు కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి: పొంగులేటి
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. కుట్రలో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వాన్ని కలుస్తామని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారు.. ప్రజా బలం లేని బీఆర్ఎస్ రూ.వేల కోట్లతో రాజకీయం చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ప్రభుత్వాన్ని కూల్చాలనేది కేసీఆర్ ఆలోచనేనని.. కేసీఆర్ నోటి వెంట వచ్చిన మాటలే కొత్త ప్రభాకర్ రెడ్డి నోట వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. ధరణిలో లబ్ధిపొందిన బీఆర్ఎస్ బినామీలే ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని ప్రభాకర్ రెడ్డి చెప్పారని అన్నారు. భూభారతి రావడంతో అక్రమంగా భూములు పొందిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఫైర్ అయ్యారు. భూభారతితో కొల్లగొట్టిన భూములన్నీ వెనక్కి తిరిగోస్తాయనే భయంతో ఈ వ్యాఖ్యలు చేశారని అన్నారు. దమ్ముంటే ఎంతమంది ఎమ్మెల్యేలను కొంటారో కొనండని మంత్రి పొంగులేటి సవాల్ చేశారు. ప్రభుత్వాన్ని కుల్చే కుట్రలు జరిగితే కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.హెచ్‌సీయూ భూముల అక్రమార్కులకు కట్టబెట్టాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. అందుకోసమే ఇలాంటి కుట్రలకు తెరలేపుతోందని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, భూ భారతి అమలు చేస్తామన్నారు.
కేసీఆర్ కుట్ర: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాటల వెనుక కుట్ర కోణం ఉందన్నారు. ఇలాంటి చోటా మోటా వ్యాఖ్యలకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ కు ప్రజా బలం ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ మొదటి నుండి ప్రభుత్వంపై కుట్రలు చే
స్తున్నాడన్నారు.
ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదు: మంత్రి పొన్నం
కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొన్నం సెటైరికల్ కౌంటర్ వేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిది ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం అనుకున్నా.. కానీ ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెబుతున్నారని విమర్శించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తాం అంటే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. పడగొట్టుదాం రండీ అంటే పోవడానికి ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
విచారణ జరిపించాలి : ఎంపీ చామల కిరణ్
కొత్త ప్రభాకర్ రెడ్డి కి నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయించాలని, ఎంపీ చామలకిరణ్ అన్నారు. విచారణ చేయించి.. ఆ వ్యాపారులు, బిల్డర్లు ఎవరో నిజాలు చెప్పించాలని సీఎంను కోరారు. బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, సిగ్గు శరం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఆరోపించారు. 7లక్షల కోట్ల అక్రమ సంపాదనతో బిఆర్ఎస్ కూల్చివేత రాజకీయాలు చేస్తున్నదన్నారు.








