పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే ఇబ్బందులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠాన నిర్ణయమే ఫైనల్ అంటూ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. విస్తరణపై ఎవరేం మాట్లాడినా ఉపయోగం లేదన్నారు. ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనేది అధిష్టానానికి పూర్తిగా తెలుసని, అందరి పని తీరు, ప్రజల్లో వారికి ఉన్న పరపతి తదితర అంశాలన్నింటినీ ఎప్పటికప్పుడు అధిష్టానం తెలుసుకుంటుందన్నారు. ప్రజా ప్రతినిధులు పదవులపై ఆలోచనను వదిలేసి జనంలోకి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించి ప్రతిష్ఠను పెంచాలన్నారు. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.
ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని కొన్ని సమస్యలకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని సీఎం పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం ఒక అద్భుతమని ఆనాడు రూ.2 కిలో బియ్యంలా ఇప్పుడు సన్నబియ్యం పథకం శాశ్వతంగా గుర్తుండే పథకమని సీఎం వివరించారు. భూ భారతిని రైతులకు చేరవేయాలన్నారు. దేశంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆదర్శంగా నిలిచిందని క్షేత్ర స్థాయిలో నిజమైన లబ్ధిదారులకే అందాలని దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను శాశ్వతంగా, పకడ్బందీగా పరిష్కరించామన్న సీఎం విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లులు తీసుకొచ్చామని ఇది ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనమని వెల్లడించారు. జటిలమైన ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని అందుకే వర్గీకరణ జరిగే వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు. ప్రత్ేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన విధ్వంసాన్ని ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న పనిని ప్రజలు హర్షిస్తున్నారని, అయితే దీన్ని ప్రజా ప్రతినిధులు సరైన రీతిలో ప్రచారం చేసుకోలేకపోతున్నారన్నారు. గత పాలకులు రాష్ట్ర వనరులను యధేచ్ఛగా దోచుకున్నారని, ఆ దోపిడీకి చరమగీతం పాడి రాష్ట్ర సంపదను పెంచేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్నాయన్నారు. గత పాలనకు ప్రస్తుతం పాలనకు స్పష్టమైన తేడా ఉందని ప్రజల నుంచి ఫీడ్ భ్యాక్ వస్తుందని, ఆ తేడా పాజిటివ్ కోణంలో ఉన్నా మనం అనుకున్నంతాగ ప్రజల్లో చర్చకు తేలేకపోతున్నామన్న విషయ.ాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
మళ్ళీ గెలవాలంటే
హెచ్‌సీయూ భూములపై ప్రతిపక్షం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో ఒక అబద్ధపు ప్రచారం చేసిందని, ఈ ప్రచారాన్ని ప్రధాని మోదీ కూడా నమ్మి బుల్డోజర్లు పంపిస్తున్నారని మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్రజా ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పార్టీ, ప్రభుత్వం ప్రతిష్ఠ పెరిగితేనే భవిష్యత్ ఉంటుందని మనం ఎంత మంచి చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లకపోతే ప్రయోజనం ఉండదన్నారు. మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివరించారు. మీ నియోజకవర్గంలో ఏం కావాలో ఒక నివేదిక తయారు చేసుకోవాలని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ పనులను పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. నిన్న మొన్నటి వరకు బండి సంజయ్, కిషన్ రెడ్డి మనపై విమర్శలు చేశారని ఇప్పుడు ఏకంగా ప్రధాని మోదీనే రంగంలోకి దిగారన్నారు. తెలంగాణ పథకాలతో ప్రధాని మోదీ ఊక్కిరి,బిక్కిరి అవుతున్నారని తెలిపారు. వర్గీకరణ మోదీకి గుదిబండగా మారిందన్నారు. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టాలనే బీజేపీ, బీఆరెఎస్ ఒక్కటయ్యాయన్నారు. సన్న బియ్యం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న బియ్యం మన పథకం మన పేటెంట్, మన బ్రాండ్ అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
గ్రామాల్లో పర్యటించండి
ప్రతి ప్రజా ప్రతినిధి గ్రామాల్లో పర్యటించాలని, ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచే మొదలు పెట్టాలన్నారు. గ్రామగ్రామాన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం గడచిన 16 మాసాలుగా చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలన్నారు. పదేళ్ళ పాలనకు, 15 మాసాల పాలనకు వ్యత్యాసంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అదే విధంగా ప్రజా ప్రభుత్వం తీసుకు వచ్చిన భూ భారతి, సన్న బియ్యం పంపిణీ, రైతు రుణ మాఫీ, ఉద్యోగ జాతర తదితర అంశాలను ప్రస్తావించడంతో పాటు లబ్ధిదారులతో గ్రామస్థులతో కలిసి చర్చించాలన్నారు. మహిళా సాధికారత కోసం ప్రజా ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్యతలను కూడా వివరించాలన్నారు. మనం ఎన్నో సాహసోపేతమైన మనిర్ణయాలను తీసుకున్నాం, అయితే వీటన్నింటినీ ప్రజల్లోక బలం తీసుకు వెళ్ళడంలో ఎక్కడో లోపం ఉంది, ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే రాబోయే 20 సంవత్సరాలు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు.
అధిష్టానం సుప్రీం
ఏ పదవిని ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుందని, ఈ విషయంలో నేతలు బహిరంగంగా మాట్లాడి ఇబ్బందులకు గురవడం మంచిది కాదన్నారు., మంత్రులు ఎవరు, ప్రభుత్వంలో పని చేసేది ఎవరు, పార్టీ కోసం పని చేసేది ఎవరు అన్న విషయాలను పక్కకు పెట్టాలన్నారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పని చేసి ప్రజల మెప్పును సంపాదించుకున్న నేతలను పార్టీ ఎప్పుడూ విస్మరించబోదన్నారు. ఎవరో ఎవరినో అడ్డుకున్నారనుకుంటే అది భ్రమే అవుతుందన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు మాని విపక్షాలు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఎప్పటికప్పుడు గమనించి తిప్పి కొట్టి సమర్థతను నిరూపించుకోవాలని హితవు పలికారు. విపక్షాల విమర్శలను ఎక్కడికక్కడే తిప్పు కొట్టాలన్నారు.








