ఇంద్రవెల్లి కొండల్లో.. దండు కదిలింది అంటూ ఆదివాసీ ఉద్యమ గుర్తులను, పోరాట పటిమను నెమరువేసుకునే పాటలెన్నో మనసులో మెదులుతాయి. తాను పీసీసీ అధ్యక్షుడు కాగానే.. ఇంద్రవెల్లిలోనే మొదట సభ నిర్వహించి అప్పటి కేసీఆర్ పై రణభేరి మోగించిన రేవంత్ రెడ్డి.. పోరాట పటిమతో ఆ సర్కారును కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఈ సర్కారుకు ఇంద్రవెల్లికీ ఓ అనుబంధం ఉంది. అయితే ఇంద్రవెల్లి అమరవీరుల త్యాగాల స్ఫూర్తిని.. ఈ ప్రభుత్వం కొనసాగించాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. నాలుగుదశాబ్దాల క్రిత ఇంద్రవెల్లి ఓ జలియన్ వాలాబాగ్.
మరో జలియన్‌వాలాబాగ్
నాలుగు దశాబ్దాల కిందట ఉవ్వెత్తున ఎగిసిపడిన ఉద్యమం, నిలదీసి అడిగితే తప్ప బతుకు మారదనే ఆక్రోషం, జనంలో జనమై నినదించేలా చేసిన తెగువ పోలీసు కాలుల్పకు దారితీసింది. స్వతంత్ర భారతావనిలో మరో జలియన్‌వాలాబాగ్ దురంతంలా ప్రసిద్ధి పొందిన అమరత్వం. దుర్భరమైన జీవన విధానమే వారిని నినదించేలా చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమించినా మెతుకు దొరకని ధైన్యమే పిడికెలెత్తేలా పురికొల్పింది. నిషేదాజ్ఞులను లెక్కచేయకుండా ముందుకువెళ్లేలా ధైర్యాన్నిచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో 1981 ఏప్రిల్ 20నాడు పోలీసుల కాల్పులకు దారితీసిన ఘటన మరో జలియన్ వాలాబాగ్‌గా ప్రాచుర్యం పొందటానికి దారితీసిన విషాదభరితమైన సంఘటన. అర్థాకలితో బతుకు వెళ్లదీసిన ఉమ్మడి ఆదిలాబాద్ ఆదివాసీల బతుకు దెరువు అత్యవసర పరిస్థితి తర్వాత మరింత దిగజారింది. బతకడమే కష్టంగా మారింది. ఆకలి, అనారోగ్యంతో వెళ్లదీస్తున్న వారికి ఆసిఫాబాద్‌కు పొరక దొర పేరిట వచ్చిన వరంగల్ జిల్లా ఆజాంజాహిమిల్లు కార్మికుడు దాసరి లక్ష్మీకాంతం పలకరింపు బతుకుపై భరోసా కల్పించింది. పటేల్, పట్వారీ వ్యవస్థతో అణచపడిన ఆదివాసీలను స్వయం పాలన కోసం ఉద్యమించేలా చైతన్యపర్చింది.
ముందుకు వచ్చిన ప్రభుత్వం
ఈ ఏడాది ప్రభుత్వమే అధికారికంగా సభ నిర్వహించటం గాయపడిన ఆదివాసీల భుజం తట్టినట్లైంది. సర్కారు నిర్ణయం అభద్రతతో ఉన్న ఆదివాసీలకు ధైర్యానిస్తోంది. రాజకీయాలకు తావు లేకుండా అమరుల కల సాకారం చేయాలనే ఆర్థ్రతతో నిండిన గుండెల్లో అభ్యర్థన వినిపిస్తోంది. ఇంద్రవెల్లి స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీతక్కలు ఆదివాసీలను అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్ళే ప్రతిన తీసుకోవాలని, బాటలు వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.








