Mahaa Daily Exclusive

  16 రకాల కాంబినేషన్ ఔషధాలపై కేంద్రం కొరడా…

Share

16 రకాల కాంబినేషన్ ఔషధాలపై కేంద్రం కొరడా.
* తక్షణమే నిషేధం అమలు.
* స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
హైదరాబాద్, మహా.
వైద్యపరంగా సరైన ఆధారాలు లేని, రోగుల చికిత్సలో ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం చేకూర్చని 16 రకాల ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ఔషధాలపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఈ మందుల తయారీ, అమ్మకం, పంపిణీపై తక్షణమే నిషేధం విధిస్తూ కఠిన చర్యలు చేపట్టింది. ఔషధాలు, సౌందర్య సాధనాల చట్టం కింద కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా సిరప్ రూపంలో కలిపి తయారు చేయడాన్ని వైద్య పరిభాషలో ‘ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్’ (ఎఫ్ డీసీ) అంటారు. అయితే, తాజాగా నిషేధించిన ఈ 16 రకాల కాంబినేషన్లు పూర్తిగా అహేతుకమైనవని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. వీటి వల్ల రోగులకు అదనపు ప్రయోజనం ఏమీ కలగకపోగా, అనవసరమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కమిటీ తీవ్రంగా హెచ్చరించింది. ఈ నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక, సిఫార్సుల ఆధారంగానే.. ఈ ఔషధాల వినియోగాన్ని మార్కెట్లో కొనసాగించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ప్రభుత్వం నిర్ధారించి ఈ వేటు వేసింది.
తాజాగా నిషేధించిన వాటి జాబితాలో ప్రధానంగా యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ మందులు, కడుపునొప్పికి (తిమ్మిర్లు) వాడే మందులతో పాటు కలబంద (అలోవెరా) ఆధారిత చర్మ సంబంధిత ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా అమోక్సిసిలిన్‌తో పాటు సెరాటియోపెప్టిడేస్, లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్ కలిపిన మందులు, సెఫ్యూరాక్సిమ్-సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్-ప్రోబెనెసిడ్, డైసైక్లోమైన్-పారాసెటమాల్-క్లిడినియం బ్రోమైడ్-క్లోర్డియాజెపాక్సైడ్ వంటి పలు కాంబినేషన్లను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది.
దేశ ప్రజలకు కేవలం అత్యంత సురక్షితమైన, దుష్ప్రభావాలు లేని, శాస్త్రీయంగా నిర్ధారించిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలు, మెడికల్ షాపులు ఈ మందుల క్రయవిక్రయాలను తక్షణమే నిలిపివేయాల్సి ఉంటుంది.