తెలంగాణలో ఏసీబీ దాడులు సంచలనంగా మారాయి. అధికారులు వేర్వేరు జిల్లాల్లో నిర్వహించిన దాడుల్లో ఇద్దరు అధికారులను, ఓ టీవీ రిపోర్టర్ ను లంచం సొమ్ముతో పట్టుకున్నారు. మణుగూరు పోలీస్ స్టేషన్ సీఐ ఎస్.సతీష్ కుమార్, బిగ్ టీవీ రిపోర్టర్ ఎం.గోపితో కలిసి ఓ కేసులో ఫిర్యాదు దారుడితో పాటు అతని బంధువుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు రూ.4లక్షలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధితుడు రూ.1లక్ష రూపాయలను వారికి అందచేస్తుండగా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు దాడి చేసి లంచం సొమ్ముతో సహా పట్టుకున్నారు. మరో కేసులో ఎఫ్ టీఎఫ్ నిధుల మంజూరుకు సంబంధించి ఆర్మూర్ పంచాయతీ రాజ్ శాఖ సీనీయర్ అసిస్టెంట్ ఎన్.శ్రీనివాస శర్మ ఫిర్యాదుదారుడిని రూ.7,500లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి నుంచి రూ.7వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ దాడి చేసి శ్రీనివాస శర్మను లంచం సొమ్ముతో సహా పట్టుకుంది. అదే విధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారం మునిసిపల్ ఆఫీసులో డిఈఈ సుదర్శనం రఘు, వర్క్ ఇన్‌స్పెక్టర్లు రాకేష్, సురేష్ లు సిసి రోడ్ వర్క్ పెండింగ్ రూ.11లక్షల బిల్లులు క్లియర్ చేయడానికి గాను 1.30లక్షలు లంచం డిమాండ్ చేసి, రూ. లక్ష- లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జనగామ జిల్లాలోని చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు చేయగా ఆర్ ఐ వినయ్ కుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. భూ సర్వే కోసం డబ్బులు డిమాండ్ చేయగా బాధితులు సోమవారం రూ.26 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాడెండ్ గా పట్టుకున్నారు. అనంతరం ఆర్ ఐని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.







