ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వం అండగా నిలుస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని అన్నారు. పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని ముఖ్యమంత్రి అన్నారు. శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు తన సంఘీభావాన్ని తెలిపారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఆయన అన్నారు. మే 2వ తేదీన చేపట్టే రాజధాని పనుల పున:ప్రారంభానికి ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకి విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పున:ప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు.








