ఓరుగల్లు గులాబీ ఘల్లు ఘల్లుమంటోంది. గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్నా.. తమకు అచ్చొచ్చిన ప్రాంతంలోనే భారీసభ పెట్టి శక్తి కూడగట్టుకోవాలని బీఆర్ఎస్ వరంగల్ సభకు రెడీ అయింది. మండుటెండాకాలంలో పది లక్షలమంది జనసమీకరణ లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ సభ కోసం బీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయపార్టీ నిర్వహించనంత భారీ సభ ఇపుడు బిఆర్ఎస్ నిర్వహిస్తోంది. జనసమీకరణ, హైటెక్ ఏర్పాట్లు, భోజనాలు, సభలు, ప్రచారాలు, పాటలు, కళాకారులు, వాహనాలు, హంగామాకు రూ.100కోట్ల దాకా ఖర్చు పెడుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ ఉన్నది. ప్రతీ నియోజకవర్గంలో దూరాన్ని బట్టి 5 వేల నుండి 50 వేల వరకు జనసమీకరణ టార్గెట్లు విధించారు. గులాబీదళతి కేసీఆర్ స్వయంగా ఏర్పాట్లు పర్యవేక్షించగా, అన్ని నియోజకవర్గాల్లోనూ కదలిక తీసుకొచ్చేయత్నం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవం కోసం తెలంగాణ నలుమూలల నుంచి వేలాదిగా వాహానాలు తరలి రానున్నాయి. పలు జిల్లాల నుండి ఇప్పటికే కార్యకర్తలు బయలుదేరారు. ఏ కార్యక్రమం నిర్వహించినా పండుగలా చేయడం బీఆర్ఎస్ కు ఆనవాయితీ. సభ పనులు పూర్తికాగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల్లో విభేదాలున్నప్పటికీ సభ ఏర్పాట్లు సజావుగా సాగే విధంగా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఓ సారి కేటీఆర్, మరోసారి కవిత వెళ్ళి ఏర్పాట్లు పర్యవేక్షించారు. సభా ప్రాంగణం చుట్టూ కేసీఆర్, కేటీఆర్ కటౌట్లే దర్శనమిస్తున్నాయి. ఆదినుండీ పార్టీ క్యాడర్ తో కనెక్టివిటీ ఉన్న హరీష్ రావు కు సభ వద్ద ఏర్సాటు చేసిన హోర్డింగ్ లు, ఏర్పాట్లలో ప్రాధాన్యం దక్కకపోవడంపై అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. ప్రాంతీయపార్టీల్లో ఇది సాధారణమే అయినా.. గులాబీ క్యాడర్ లో జోష్ నింపి మరో మూడున్నరేళ్ళు దీనిని కొనసాగించేలా చేయడం కేసీఆర్ కు కత్తిమీద సవాలే. రజతోత్సవ సభ విజయవంతం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై బలమైన ముద్ర వేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే ఓవైపు భారత్,పాక్ ల మధ్య యుద్ద మేఘాలు అలుముకున్న దశలో ప్రజలను కేసీఆర్ ఎంతవరకు తన వైపు తిప్పికోగలరన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఉంది.








