Mahaa Daily Exclusive

  సెలయేరులా పారుతున్న బీరు రికార్డు స్థాయిలో పెరిగిన బీర్ల అమ్మకాలు.. రోజుకు 3 లక్షల బీర్ కేసుల విక్రయాలు..!

Share

వేసవి తాపం పెరగడంతో పాటు పెళ్లిళ్ల సందడి, క్రికెట్ జోరు కలిసి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ఎండలు మండిపోతుండటంతో చల్లటి పానీయాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా యువత బీర్లను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో ఉండే అమ్మకాలతో పోలిస్తే ఇప్పుడు దాదాపు రెట్టింపు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున మూడు లక్షల బీర్ కేసులకు పైగా అమ్ముడుపోతున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ కూడా కొనసాగుతోంది. వివాహ వేడుకలు, రిసెప్షన్ల వంటి శుభకార్యాల్లో బీర్ల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో బీర్ సరఫరా చేసే కంపెనీలు డిమాండ్‌ను అందుకోవడానికి ఉత్పత్తిని పెంచాయి. మరోవైపు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ మ్యాచ్‌లు కూడా బీర్ల అమ్మకాలకు మరింత ఊతమిస్తున్నాయి. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో యువత కనిపిస్తున్నారు. మ్యాచ్ చూస్తూ బీర్ తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండటంతో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు పలు బార్ల యాజమాన్యాలు మినీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకున్నాయి.

బీర్ల అమ్మకాలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ సీజన్‌లో ఎక్సైజ్ శాఖ నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యాలను సులభంగా చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో లిక్కర్‌తో పాటు బీర్ కేసుల అమ్మకాలను మరింత పెంచాలని ఎక్సైజ్ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 5.48 కోట్ల బీర్ కేసులు అమ్ముడవగా.. ఈసారి అదనంగా కోటిన్నర కేసుల బీర్లు అమ్మాలని భావిస్తున్నారు. అలాగే.. ఐఎంఎల్ లిక్కర్ కేసులను కూడా 4 కోట్లకు పెంచాలని యోచిస్తున్నారు.

అయితే.. బీర్ల అమ్మకాలకు ఏప్రిల్, మే నెలలు చాలా కీలకమైనవి కావడంతో ఎక్సైజ్ శాఖ ప్రధానంగా వీటి అమ్మకాలపైనే దృష్టి సారించింది. రోజుకు సగటున మూడు లక్షలకు పైగా బీర్ కేసులు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐపీఎల్ ప్రారంభమైన మార్చి 22వ తేదీన ఏకంగా దాదాపు నాలుగు లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత కూడా ప్రతిరోజు సగటున మూడు లక్షల కేసులకు దగ్గరలో బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా సెలవు కారణంగా మద్యం డిపోల నుంచి లిక్కర్ లేదా బీర్ తీసుకెళ్లకపోతే ఆ తర్వాత రోజు రెట్టింపు స్థాయిలో కేసులను తీసుకెళ్లాలని ఆదేశాలున్నాయి. ఇలా ఈ రెండు నెలల్లో కోటిన్నర కేసుల బీర్లు అమ్ముడుపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.