మహా భద్రాచలం
ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపటమే లక్ష్యంగా ప్రభుత్వం భూభారతిని ప్రారంభించిందని భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు,జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని రైతు వేదికలో
భూభారతి పోర్టల్ అమలులో భాగంగా భూభారతి చట్టం -2025 అవగాహన కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ మరియు శిక్షణ కలెక్టర్ శర్మ తో కలిసి భూభారతి చట్టం అమలుపై రైతుల అవగాహన సదస్సులోవారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల విషయంలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన సంవత్సర కాలంలో పరిష్కరించుకోవడానికి భూభారతి ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించిదని, భూ సమస్యలపై గతంలో కోర్టులను ఆశ్రయించే వారని, నేడు కోర్టులను ఆశ్రయించకుండానే షెడ్యూల్ (ఏ ) ను ఏర్పాటు చేసి భూమి విలువ ఐదు లక్షలు లోపు ఉన్న పక్షంలో ఆర్డీవో స్థాయి, ఐదు లక్షల పై గా ఉన్న పక్షంలో కలెక్టర్ స్థాయి అధికారులు సమస్యను పరిష్కరించడానికి అవకాశం కల్పించారని అన్నారు.
కలెక్టర్ స్థాయిలో సమస్య పరిష్కారం కానిపక్షంలో సి సి ఎల్ ఏ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం మండల తాసిల్దార్లు, సబ్ రిజిస్టర్ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారని, ఇకనుండి చేసే రిజిస్ట్రేషన్ లను అన్ని పరిశీలించిన అనంతరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు.గతంలో ధరణిలో కొన్ని లోపాలుండడం వల్ల భూ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇప్పుడు ప్రభుత్వం రూపొందించిన భూ భారతిలో వాటిని సరి చేసిందన్నారు.
అనంతరం భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన భూభారతి చట్టం-2025 ప్రకారము భూమి హక్కులు మరియు భూ సమస్యల సత్వర పరిష్కారం జరగడానికి అవకాశం ఉందని, మారుమూల ప్రాంత గిరిజన రైతులు భూ సమస్యలను ఈ భూభారతి చట్టం ద్వారా శాశ్వతంగా పరిష్కారం చేసుకోవచ్చని రైతులకు సూచించారు. భూభారతి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు సంబంధిత రెవెన్యూ అధికారులను కలిసి పరిష్కరించుకోవాలని, భూ సమస్యల విషయంలో అధికారులు ఎవరైనా సహకరించకపోతే వెంటనే జిల్లా కలెక్టర్ దృష్టికి కానీ, నా దృష్టికి తీసుకొని రావాలని అన్నారు.
ఈ అవగాహన సదస్సులో భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తాసిల్దార్ శ్రీనివాసరావు, రైతులు మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.








