భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 29 (మహా)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్ గ్రామం వద్ద జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల్లోకెళితే బూర్గంపాడుకు చెందిన ఓ కుటుంబం కారులో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. మరొక వాహనంలో సౌత్ కొరియాకు చెందిన టూరిస్టులు భద్రాచలం రాములోరి దర్శనానికి వెళ్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వినోభానగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆళ్లపల్లి మండలం రామానుజగూడెం గ్రామానికి చెందిన వానపాకుల సాంబశివరావు (24) కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మరో ఏడుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణం కావచ్చని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఇద్దరికి కాళ్లు విరగ్గా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.








