Mahaa Daily Exclusive

  *చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..!

Share

ఖమ్మం – మహా.
యాసంగి పంట చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం లోని తన నివాసంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి ధాన్యం కొనుగోలు, భూభారతి చట్టం అమలు, ఇందిరమ్మ ఇండ్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ  ఖమ్మం జిల్లాలో రైతులు పండించిన చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయాలని, సన్న రకం వడ్లకు క్వింటాల్ 500 రూపాయల బోనస్ అందించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి, రైతులకు త్వరగా చెల్లింపులు చేసేలా వివరాలను ఎప్పటి కప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

యాసంగి పంటకు గాను జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 83 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని, దీనికి గాను రైతులకు 85 కోట్ల 30 లక్షల రూపాయల చెల్లింపులు కూడా పూర్తి చేశామని,  ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల వద్ద మరో 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని అధికారులు తెలిపారు.  కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్స్ కు  తరలించాలని మంత్రి అన్నారు

కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన వసతులు కల్పించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కోతలు ఉండడానికి వీలులేదని, రైతులకు ఎక్కడ నష్టం రాకుండా చూసుకోవాలని, కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగుల కొరత రాకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

ఏప్రిల్ నెలాఖరు నాటికి భూభారతి రైతు సదస్సుల ద్వారా నేలకొండపల్లి మండలంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి రెవెన్యూ అధికారులకు సూచించారు. మనం 20 రెవెన్యూ గ్రామాలకు ఇప్పటివరకు 2380 దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో వెంటనే పరిష్కారం చూపేందుకు అవకాశం ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు.

రైతులకు భూ భద్రత కల్పించేందుకు ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం పూర్తి స్థాయిలో వినియోగించాలని, సాదా బైనామా దరఖాస్తులను వంద శాతం పరిష్కరించాలని, భూ భారతి చట్టం రూల్స్ ను తూచా తప్పకుండా పాటించాలని, నిర్దేశిత సమయంలో దరఖాస్తుల పరిశీలన జరగాలని, కార్యాలయం చుట్టూ రైతులు తిరగాల్సిన అవసరం ఉండకుండా చూడాలని అన్నారు.

ప్రతి మండలంలో ఎంపిక చేసిన గ్రామంలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ చేయాలని అన్నారు. బేస్మెంట్ వరకు పూర్తి చేసుకున్న నిర్మాణాల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేస్తే లక్ష రూపాయ లను ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అందించిన లబ్ధిదారుల జాబితాను మరో సారి క్షేత్రస్థాయిలో పరిశీలించి అనర్హులు ఎవరైనా ఉంటే తీసి వేయాలని అన్నారు.

ఇందిరమ్మ ఇండ్లను ప్రజలు గ్రౌండ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇబ్బందులు ఉంటే వారికి మహిళా సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని మంత్రి సూచించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, డిఆర్డీవో సన్యాసయ్య, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, డిఎం సివిల్ సప్లయిస్ శ్రీలత, డిఏఓ పుల్లయ్య, డిసిఓ గంగాధర్, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.