మహా : సాధారణ బదలీలలో పర్యాటక శాఖ నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదలీ అయిన సీనియర్ ఐఎఎస్ అధికారి స్మితాసబర్వాల్ పర్యాటక శాఖలో తాను చేసిన పనిని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ తన పోస్టును ప్రారంభించారు. పర్యాటక శాఖలో పని చేసిన తీరును చెప్పిన స్మితా సబర్వాల్ కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన అంటూ తన పోస్టును ప్రారంభించిన స్మిత సబర్వాల్ పర్యాటక శాఖలో నాలుగు నెలల కాలం పని చేసి, తన వంతుగా అత్యుత్తమ సేవలు అందించడానికి కృషి చేశానన్నారు. నువ్వు కర్మ చేయడానికి మాత్రమేగానీ, ఆ కర్మఫలానికి అధికారివి కాదు. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు అంటూ భగవద్గీత శ్లోకాన్ని తన పోస్టులో పేర్కొన్న స్మిత సబర్వాల్ తను చేసే పనికి ప్రతిఫలాపేక్ష తో కాకుండా పనిచేయడమే తన విధి అని పేర్కొన్నారు.
రాష్ట్రానికి మొట్ట మొదటి సారిగా దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 2025- 30 పర్యాటక విధానాన్ని తీసుకువచ్చామని, ఈ విధానం వల్ల రాష్ట్రంలో నిర్లక్ష్యం చేయబడిన పర్యాటక ప్రాంతాలకు దిశానిర్దేశం చేయడం జరిగిందన్నారు. మిస్ వరల్డ్ పోటీల గురించి స్మితా సబర్వాల్ పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన పునాదిగా ఈ పర్యాటక విధానం నిలుస్తుందని వెల్లడించారు. ఇక తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకొని నిర్వహించడానికి తలపెట్టిన మిస్ వరల్డ్ పోటీల గురించి ప్రస్తావించారు. హైదరాబాద్ లో జరిగే మిస్ వరల్డ్ పోటీలు ఒక గ్లోబల్ ఈవెంట్ అని, దీనికి అవసరమైన ప్రణాళిక, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు పునాది వేశానని ఆమె పేర్కొన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో అనేక అవకాశాలకు తలుపులు తీస్తుందని తాను విశ్వసిస్తున్నానని తెలిపారు. పర్యాటక శాఖలో పని చేయడం గర్వంగాను, గౌరవం గాను భావిస్తున్నానని వెల్లడించారు. అయితే స్మిత సబర్వాల్ పోస్ట్ చూసిన నెటిజన్లు ఆమె చేసిన కృషిని కొనియాడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ శివార్లలో కంచె గచ్చిబౌలి భూములు కేటాయింపు వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో స్మిత సబర్వాల్ పోస్ట్ పెట్టడంతో ఆమెపై బదిలీ వేటు పడింది అని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ తాజా పోస్ట్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.








