భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 30 (మహా):
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల శ్రమకు గుర్తింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమలు గుర్తించి జీతాలు వెంటనే పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద భారీ నిరసన దీక్షను చేపట్టి అనంతరం హెడ్ ఆఫీస్ ముందు భారీ ధర్నాను నిర్వహించారు.
ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత నాలుగు నెలల నుండి సింగరేణి కాంట్రాక్టు కార్మికులు యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు పెంచుతున్నామని, శుభవార్త త్వరలోనే చెబుతామని మోసం చేయకుండా కళ్ళ బొల్లి మాటలు ఆపి వెంటనే ప్రకటన చేయాలని కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారనే ప్రకటన చేయాలని కోరుతూ, దశలవారీగా కాంట్రాక్టు కార్మికులు ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా తెలిపారు. సింగరేణి ప్రధాన అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు ఉప ముఖ్యమంత్రికి యూనియన్లన్నింటి తరఫున వినతి పత్రాలు అందచేస్తూ, మన గోడు చెప్పినప్పటికీ త్వరలోనే జీతాలు పెంచుతామని ప్రకటన చేసి సంవత్సరం గడుస్తున్నా , నేటికీ ఒక్క ప్రకటన కూడా జీతాల విషయంలో ఎటువంటి పురోగతి లేదని వారు విమర్శించారు. గత నాలుగు నెలల నుండి సింగరేణి సీ అండ్ ఎండి బలరాం నాయక్ ను కలిసి జేఏసీ నాయకులు కోదండరాంతో చర్చలు జరిపినప్పటికీ, ఎటువంటి మార్పు లేదని, ప్రకటన చేస్తామని చెప్పి రోజులు గడుస్తున్నాయి తప్ప కార్మికులకి ఎటువంటి శుభవార్త ఎందుకు చెప్పలేదని వారు ప్రశ్నించారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల కమిటీ వేసి ప్రకటిస్తామని ఇదిగో ప్రకటిస్తాం, అదిగో ప్రకటిస్తాం అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప కాంట్రాక్టు కార్మికుల శ్రమను మాత్రం గౌరవించట్లేదని వారు విమర్శించారు. సింగరేణి స్ట్రక్చర్ మీటింగ్ లో సింగరేణి కాంటాక్ట్ కార్మికుల గురించి చర్చించకుండా జీతాలు వైద్య సదుపాయాలు కార్మికులకు ఇచ్చే సౌకర్యాల పట్ల ఎటువంటి ప్రకటన చేయకుండా ఆ మీటింగ్ ను ముగించి మళ్లీ కాంట్రాక్టు కార్మికులకు నష్టం చేకూర్చారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కోలిండియా వేతనాలు అమలు చేయాలని జీవో నెంబర్ 22న అమలు చేసి గెజిట్ చేసి వెంటనే కార్మికులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 వేల మంది కార్మికులు సింగరేణిలో పనిచేస్తుంటే అత్యధిక భాగం సింగరేణి లాభాల్లో తమ శ్రమ ఉందని, లాభాల్లో వాటా కూడా ఇవ్వాలని అడుగుతుంటే, వేతనాల వేతనాలు మాత్రం పెంచకుండా మాయమాటలతో కార్మికులను మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చామని, మాటలకు మాత్రమే పరిమితమై ఆచరణ మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని, కాంట్రాక్టు కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సమతి తల్లి ప్రేమ కనబరుస్తుందని వారు విమర్శించారు. ఈ దీక్షను కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మల్లెల రామనాథం, ఏజే రమేష్, ఆర్ మధుసూదన్, కాపు కృష్ణ, రెడ్డి ఎం శ్రీనివాస్ విశ్వనాథ్ లు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ, సింగరేణి కాంటాక్ట్ కార్మికుల జీతాలు ఇప్పటికైనా పెంచకుంటే కాంట్రాక్టు కార్మికుల సత్తా ఏమిటో భవిష్యత్తు కార్యరూపం దాల్చకముందే సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు .
కాంట్రాక్టు కార్మికులందరూ జీతాలు పెంపుదలపై ఒక్క తాటిపై ఉన్నారని, జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ఉగ్రరూపం దాల్చాల్సినటువంటి సమయం ఆసన్నమైందని వారు తెలిపారు . అనేక సంవత్సరాల నుండి జీతాల పెంపుదల కోసం దశల వారి పోరాటాలు చేస్తున్నామని, జీతాల పెంపుదల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు త్వరలోనే పెంచుతామని సింగరేణి సీ అండ్ ఎం డి బలరాం నాయక్ యూనియన్ నాయకులకు హామీ ఇచ్చిన సంగతిని మరిచారన్నారు. కనీస వేతనాలు (ప్రభుత్వ ఉత్తర్వు) జి ఓ 22 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీతాలు పెంచే విధంగా మేడే సందర్భంగా ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు . మేడేలోపు జీతాలు పెంచకపోతే తదనంతరం అన్ని యూనియన్ల తో కలుపుకొని జెఎసి ఆద్వర్యంలో పోరాటం ఉధృతంగా కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కాంట్రాక్ట్ కార్మికుల శ్రేయస్సు కోసం చొరవ చూపించి వేతనాలు పెంచే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని జేఏసీ నాయకత్వం డిమాండ్ చేసింది. భవిష్యత్తులో జరిగే పోరాటాలకు తీవ్రమైన పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు అన్నారు. సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కనీస వేతనాల అమలు కోసం సీరియస్ గా తీసుకోకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని వారు హెచ్చరించారు. పోరాటం ఉగ్రరూపం దాల్చకముందే జీతాలు పెంచాలని వారు కోరారు.
– సంపూర్ణ సంఘీభావం మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులు
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ, కార్యదర్శి జాటోత్ కృష్ణ ,కాంగ్రెస్ పార్టీ నాయకులు జేబీ శౌరి, సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు కందగట్ల సురేందర్, ఏ ఐ ఎఫ్ టి యు రత్నకుమార్ ,సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, డి వీరన్న, నందిపాటి రమేష్, గోపాల్ రావు ,సంపూర్ణ మద్దతు తెలిపారు .
ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు దూలం శ్రీనివాస్ దూలం శ్రీనివాస్ కే బ్రహ్మచారి డి వీరన్న రాజశేఖర్ చంద్రశేఖర్ సక్రం రాజేష్ శంకర్ విజయ్ ఉప్పెర్ల ప్రశాంత్ శంకర్ మల్లేష్ రవి సమ్మయ్య రాణి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు .








