అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మే డే) సందర్భంగా బిఆర్ఎస్ మాజీ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు కార్మిక కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా కు ఒక పత్రిక ప్రకటన విడుదల చేసారు. కార్మికులు దేశ నిర్మాణ శిల్పులని వారి శ్రమ లేకుండా అభివృద్ధి అసాధ్యమని పేర్కొన్నారు. కార్మికులు పని చేసే ప్రతిచోటా వారి వంతు శ్రమ, అంకితభావం నిండి ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువులా పనిచేసే ఈ వర్గాన్ని గుర్తించి, వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పదిహేను, పదిహేడవ లోక్ సభల్లో తాను కార్మికుల హక్కుల కోసం, సింగరేణి సమస్యలు పైన లోక్ సభలో మాట్లాడటం జరిగిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం పట్ల ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల కోసం అనేక అభివృద్ధి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అలాగే అసంగటిత రంగ కార్మికులకు ప్రత్యేక గుర్తింపు కల్పించి వారికి సహాయం చేసే విధంగా నాడు అనేక కార్యక్రమాలు చేపట్టడం గర్వించదగిన విషయం అని పేర్కొన్నారు. ఇప్పటికీ పలు రంగాల్లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి అవసరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.కార్మికుల పట్ల ఉన్న అసమానతలు తొలగించేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని, కార్మికుల శక్తిని గౌరవించడమే నిజమైన అభివృద్ధికి నాంది అని అన్నారు. దేశ అభివృద్ధికి జీవనాధారమైన వారిని గౌరవించడం, వారికో భద్రమైన జీవితం కల్పించడం తో పాటు వారి జీవితాల్లో వెలుగు నింపాల్సిన అవసరం ఉందని అని నామ స్పష్టం చేశారు.







