Mahaa Daily Exclusive

  న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులను ప్రోత్సహించాలి. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.!

Share

ఖమ్మం, మహా.
జిల్లాలో న్యాచురల్ ఫార్మింగ్ వైపు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో న్యాచురల్ ఫార్మింగ్ పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

న్యాచురల్ ఫార్మింగ్ క్రింద చేపట్టిన కార్యక్రమాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. న్యాచురల్ ఫార్మింగ్ పై వ్యవసాయ క్లస్టర్ వారీగా చేపట్టిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ 35 సంవత్సరాల క్రితం న్యాచురల్ గా చేసే వ్యవసాయం ద్వారా వచ్చే పంటలో పోషక విలువలు అధికంగా ఉండేవని, నేడు ఎరువులు అధికంగా వాడటం వల్ల రైతుకు పెట్టుబడి పెరగడంతో పాటు వచ్చే పంట దిగుబడిలో నాణ్యత ఉండటం లేదని, న్యాచురల్ ఫార్మింగ్ పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

మన పూర్వీకులు తిన్న ఆహారంలో ఉన్న పోషక విలువలలో నేడు మనకు కనీసం 20 శాతం మించి ఉండటం లేదని అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ పై విస్తృత ప్రచారం కల్పించి, దీనికి ఆసక్తి కనబరిచిన రైతుల పొలాల దగ్గర ఫీల్డ్ సాయిల్ టెస్టింగ్ చేసే యంత్రాలు తెప్పించుకొని సాయిల్ ప్రొఫైల్ తయారు చేయాలని కలెక్టర్ తెలిపారు.

పొలాలలో ఉన్న లోపాలను పరిశీలించి న్యాచురల్ గా అధిగమించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలని గుర్తించి రైతులకు తెలియజేయాలని కలెక్టర్ అన్నారు. రైతులు న్యాచురల్ పద్దతులను పాటిస్తున్నార లేద వ్యవసాయ విస్తరణ అధికారులు పరిశీలించాలని అన్నారు. రైతులతో ఎప్పటికప్పుడు సంప్రదించేందుకు గ్రామాలలో ఇద్దరు రైతు మిత్రలను వారం రోజులలో ఎంపిక చేసుకోవాలని అన్నారు. ‌

ఒక క్లస్టర్ లో ఒక క్రాప్, రైతులను వ్యవసాయ విస్తరణ అధికారి ఎంపిక చేసుకొని అక్కడ న్యాచురల్ ఫార్మింగ్ జరిగేలా చూడాలని, 6 నెలల తర్వాత పండిన పంటకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ దగ్గర ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పండించిన పంటలు అమ్ముకునేందుకు కూడా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.

ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసే ప్రత్యేక ఆర్గానిక్ మార్కెట్ వద్ద కేవలం ఆర్గానిక్, న్యాచురల్ పద్ధతులలో పండిన పంటలు మాత్రమే అమ్ముకునేందుకు అవకాశం ఉంటుందని, ముందుగా పంట పొలాల దగ్గర పరీక్షలు నిర్వహించి, న్యాచురల్ పద్ధతిలో సాగు జరిగిందని ధృవీకరించిన తర్వాతే మార్కెట్ లో అవకాశం కల్పిస్తామని అన్నారు.

మనం న్యాచురల్ ఫార్మింగ్ చేసిన తర్వాత సాయిల్ టెస్టింగ్ చేసి ఎటువంటి మార్పులు వచ్చాయో పరిశీలించాలని అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ చేసే దగ్గర రెగ్యులర్ గా సాయిల్ టెస్టింగ్ చేస్తామని, రెగ్యులర్ గా సాయిల్ ప్రొఫైల్ పెరగాలని, పెట్టుబడి తగ్గి, పంట దిగుబడి పెరగాలని అన్నారు.

న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా పంటలు పండించే రైతుల పద్దతులను గ్రామాలలో ఇతర రైతులకు చూపించాలని అన్నారు. న్యాచురల్ ఫార్మింగ్ కు డిమాండ్ వచ్చిన తర్వాత గ్రామాల వారీగా కూడా మనం ఆర్గానిక్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని అన్నారు.

ఆర్గానిక్ పద్ధతుల్లో సాగుచేసిన పంటలను తినడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుందని దీని పట్ల ప్రజలలో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ తెలిపారు. న్యాచురల్ పద్ధతుల్లో సాగు చేసే రైతులకు అవసరమైన పశువుల మల విసర్జనలు, ఇతర ఇన్ పుట్ పరికరాలను అందేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామని అన్నారు.

ఆర్గానిక్ ఫార్మర్ రామిరెడ్డి మాట్లాడుతూ, 25 సంవత్సరాల నుంచి వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఆర్గానిక్ మార్కెట్ ఏర్పాటు చేస్తే రైతులు న్యాచురల్ ఫార్మింగ్ వైపు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుందని అన్నారు. రైతులకు న్యాచురల్ ఫార్మింగ్ చేసేందుకు వీలుగా ఇన్ పుట్ యూనిట్లను అందించేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో జిల్లా హార్టికల్చర్ సెరికల్చర్ అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్, నీటిపారుదల శాఖ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, ఏ.ఈ.ఓలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.