భద్రాద్రి కొత్తగూడెం, మే 15 (మహా): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు, ప్రజల నుంచి ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ జతేష్ వి. పాటిల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం పెండింగ్ భూభారతి దరఖాస్తులు, రేషన్ కార్డులు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరియు పెండింగ్ ఎలక్షన్ దరఖాస్తులు పై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,679 భూభారతి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పెండింగ్ దరఖాస్తులు వివరాలను నివేదిక సమర్పించాలని ఏ స్థాయిలో ఎన్ని రోజులు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి అన్న వివరాలు తెలియ పరచాలని అధికారులను ఆదేశించారు. రెవిన్యూ అధికారులు పారదర్శకంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ, నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు.ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు.
ప్రజా పాలన మరియు మీ సేవ ద్వారా వచ్చిన రేషన్ కార్డు దరఖాస్తుల పరిశీలన వారంలోగా పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు ను ప్రామాణికంగా తీసుకుంటుందని, కాబట్టి పేదలకు అందించే సంక్షేమ పథకాల మంజూరులో రేషన్ కార్డు కీలకం అందువలన రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తు ల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి, కొత్త రేషన్ కార్డులు మరియు అదనపు కుటుంబ సభ్యుల జతపరచటం, చనిపోయిన వారి పేర్లను తీసివేయడం వంటివి త్వరితగతను పూర్తి చేయాలన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎంత ఉంది సరిపడా బ్యాగులు అందుబాటులో ఉన్నాయా లేదా ధాన్యం రవాణా అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తరలించడానికి ఎన్ని లారీలు అవసరమవుతుందో అంచనా వేసుకుని దానికి తగినట్టుగా రవాణాకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వాహనాలలో దాన్యం లోడింగ్ చేయుటకు సరిపడా హమాలీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాసిల్దార్లను ఆదేశించారు. ఎక్కడైనా ధాన్యం రవాణా లో ఇబ్బంది కలిగితే పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలియపరచి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు కేవలం ధాన్యంలోని తేమను చూడటం మాత్రమే కాకుండా, రంగు మారిన ధాన్యం గుర్తించి ఆ ధాన్యాన్ని విడిగా లారీలలో కాకుండా ట్రాక్టర్ ద్వారా మిల్లర్లతో సమన్వయ చేసుకొని రవాణా చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు లేదా అలసత్వం ప్రదర్శించిన కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు.
జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఎన్నికల దరఖాస్తులు ఫారం 6, 7 మరియు 8 లను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.








