Mahaa Daily Exclusive

  గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి తుమ్మల…!

Share

ఖమ్మం, మహా.

జులై 15 కల్లా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మంత్రి, అధికారులతో కలిసి వేంసూరు నుండి ధాంసలాపురం వరకు ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే గుండా ప్రయాణిస్తూ, క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఖమ్మం- దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే జిల్లాలో 3 ప్యాకేజులుగా విభజించి పనులు పురోగతి లో ఉన్నాయన్నారు. పనులు క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేసి, సమస్యలు గురించి తెలుసుకోవడానికి పర్యటిస్తున్నట్లు తెలిపారు. జులై 15 కల్లా పూర్తిస్థాయిలో పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని అధికారులను ఆదేశించారు.

ప్యాజేజి-1 క్రింద తల్లంపాడు నుండి సోమవరం వరకు 30 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం రూ. 772.11 కోట్ల అంచనాలతో చేపట్టగా, 75 శాతం పనులు పూర్తయినట్లు అన్నారు. ఇట్టి ప్యాకేజీలో 32 స్ట్రక్చర్లు ఉండగా, 29 పూర్తయ్యాయని తెలిపారు. ధాంసలాపురం వద్ద ఎన్ఎస్పి కాల్వలో పిల్లర్ల విషయమై అలైన్మెంట్ లో కాస్త ఆలస్యం అవగా, ప్రస్తుతం పనులు వడివడిగా సాగుతున్నాయన్నారు.

ప్యాకేజి-2 క్రింద సోమవరం నుండి చింతగూడెం వరకు 27 కి.మీ. మేర రూ. 637.11 కోట్ల అంచనాలతో పనులు చేపట్టినట్లు, ఇప్పటివరకు 81 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. ఇట్టి ప్యాకేజీలో 39 స్ట్రక్చర్లకు గాను 35 నిర్మాణాలు పూర్తయినట్లు ఆయన అన్నారు.

ప్యాకేజి-3 క్రింద చింతగూడెం నుండి రేచర్ల వరకు 38 కి.మీ. మేర రూ. 804.69 కోట్ల వ్యయ అంచనాలతో పనులు చేపట్టగా, ఇప్పటి వరకు 85 శాతం పనులు పూర్తయినట్లు అన్నారు. ఈ ప్యాకేజి కి సంబంధించి 55 స్ట్రక్చర్లు ఉండగా, 51 నిర్మాణాలు పూర్తయినట్లు తెలిపారు.

పనుల పురోగతికి ఎటువంటి సమస్యలు లేవని, అన్ని ప్యాకేజీలలో పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయని అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో సర్వీస్ రోడ్ విషయమై ప్రతిపాదనలు సమర్పించి, మంజూరు చేయిస్తామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాంత మంత వ్యవసాయ ప్రాంతం కావున, సర్వీస్ రోడ్ చాలా అవసరమని మంత్రి అన్నారు.

గ్రీన్ ఫీల్డ్ హైవే లో సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 3 ఎక్జిట్లు ఉన్నాయని, దేశంలోని ఏ రాష్ట్రంలోని నియోజకవర్గ పరిధిలో గ్రీన్ ఫీల్డ్ హైవే లో 3 ఎక్జిట్లు లేవని మంత్రి అన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే అందుబాటులోకి వస్తే, ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని, రవాణా వ్యవస్థ మెరుగవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, నేషనల్ హైవే పిడి దివ్య, కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేందర్ గౌడ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.