కరీంనగర్, మహా;
ప్రభుత్వ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు విభిన్న అంశాలలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దఫాలో 500 మంది ఉపాధ్యాయులకు ఈనెల 13 నుండి 17 వరకు శిక్షణ కొనసాగుతోంది.
గురువారం ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన బోధనాపరమైన బాధ్యతలే కాకుండా విద్యార్థుల సంరక్షణ బాధ్యతలు కూడా ఉన్నాయని అన్నారు. వృత్తి నిబద్ధత, అంకితభావంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన నైపుణ్య మెళకువలు నేర్చుకొని విద్యార్థులకు బోధించాలని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో ప్రభుత్వ విద్యార్థుల కోసం అనేక విభిన్న కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, రానున్న విద్యా సంవత్సరంలోనూ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ మరిన్ని కొత్త సేవలను ఆవిష్కరిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రతి పాఠశాలలో లైబ్రరీ ఉండేలా చూస్తామని వివరించారు.
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని అన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలు, రక్షణ చర్యల గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు. తద్వారా విద్యార్థులకు చదువుతోపాటు సంరక్షణ చర్యలను కూడా తెలియజేయవచ్చని, నేరాలు జరగకుండా అరికట్టవచ్చని సూచించారు. నిత్యం విద్యార్థులను గమనిస్తూ చెడుదోవ పట్టకుండా కాపాడాలని, వారిని నిత్యం పలకరిస్తూ విద్యార్థుల్లో అకస్మాత్తుగా కలిగే మార్పులను గమనించాలని తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడకుండా వారిని కాపాడాలని, రోడ్డు భద్రత ట్రాఫిక్ పై అవగాహన పంటివి వారికి కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఫోక్సో, యాంటీ డ్రగ్, ట్రాఫిక్, డిజిటల్ అరెస్ట్ వంటి విషయాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి జైపాల్ రెడ్డి, కోఆర్డినేటర్లు ఆంజనేయులు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.








