భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని గురువారం మిస్ వరల్డ్ పోటీదారులు దర్శించుకున్నారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ఆలయ సంప్రదాయం ప్రకారం అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో కొండపైకి చేరుకున్న ఈ సుందరీమణులు, అఖండ దీపారాధన మండపంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కృష్ణశిలతో నిర్మితమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టతను ప్రపంచ సుందరీమణులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో కృష్ణారెడ్డి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి (ఏఈవో) భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సుందరీమణుల పర్యటన సందర్భంగా ఆక్టోపస్, తెలంగాణ స్పెషల్ పోలీస్ దళాలు, ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోచంపల్లిలో ఇక్కత్ కళావైభవం
ముందుగా పోచంపల్లిలో చేనేత ఇక్కత్, డబుల్ ఇక్కత్ చీరల తయారీ, పుట్టపాక తేలియా రుమాల్, సిద్దిపేట గొల్లభామ, నారాయణపేట, గద్వాల చీరలు, వస్త్రాలను పరిశీలించారు. టూరిజం విలేజ్‌గా ప్రసిద్ధి చెందిన పోచంపల్లిని ఆఫ్రికా ఖండంలోని 25 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించారు. గ్రామానికి విచ్చేసిన ఈ విదేశీ అతిథులకు స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇక్కత్ చీరల విశిష్టతను, వాటి తయారీ విధానాన్ని సుందరీమణులు ఆసక్తిగా పరిశీలించారు. అంతేకాకుండా, కొందరు పోటీదారులు స్వయంగా మగ్గంపై చీరలు నేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పర్యటన ద్వారా పోచంపల్లి చేనేత కళ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ప్రత్యేకమైన ఇక్కత్ చీరల తయారీ విధానాన్ని స్థానిక పార్కులో పరిశీలించిన అతిథులు.. నూలు వడకడం నుంచి రంగులు చొప్పించే క్లిష్టమైన ప్రక్రియలను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఒక్క చీరకు వారాలు తీసుకునే శ్రమ, డిజైన్ల సృజనాత్మకత కంటెస్టెంట్ల మనసును హత్తుకుంది. చీరలపై భిన్న డిజైన్లను గమనించిన అతిథులు, కొందరు స్వయంగా రాట్నంతో నూలు వడికే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు








