Mahaa Daily Exclusive

  రాష్ట్రపతికి డెడ్‌లైన్‌ ఏంటి? =రాష్ట్రపతి, గవర్నర్‌కు కోర్టులు గడువు నిర్దేశిస్తాయా? రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ఏం చేబుతున్నది? మూడు నెలల డెడ్‌లైన్ తీర్పుపై వివరణ కోరిన ముర్ము..!

Share

ఢిల్లీ: బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన సంచలన తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము స్పందించారు. రాష్ట గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతికి నిర్దిష్ట టైమ్‌ లైన్ విధిస్తూ ఇటీవలే సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ.. ఈ మేరకు రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌ పెట్టొచ్చా..? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందన్నారు. గవర్నర్‌తో పాటు రాష్ట్రపతికి గడువు విధించగా రాజ్యాంగంలో అలాంటి నిబంధన లేకపోవడంతో తీర్పు ఎలా ఇచ్చిందని సర్వోన్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు 14 ప్రశ్నలు అడిగారు.

రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలు ఇవే!..
=రాష్ట్రపతితోపాటు గవర్నర్‌కు అసలు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి?
=ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేస్తుంది?
=అత్యున్నత న్యాయస్థాన ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు దుర్వినియోగం చేస్తున్నాయా?
=రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందు ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి?
=ఈ ఎంపికలను అమలు చేయడంలో గవర్నర్ మంత్రి మండలి సలహాకు కట్టుబడి ఉంటారా?
=ఆర్టికల్‌ 200 కింద గవర్నర్‌ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
=ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలపై న్యాయ పరిశీలనపై ఆర్టికల్ 361 సంపూర్ణ నిషేధాన్ని విధిస్తుందా?
=ఆర్టికల్‌ 201 కింద రాష్ట్రపతి రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించడం న్యాయబద్ధమేనా?
=ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించడానికి కోర్టులు విధానపరమైన అవసరాలను నిర్ణయించవచ్చా?
=గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా?
=ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందే గవర్నర్, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉంటాయా?
=ఆర్టికల్ 142 ద్వారా రాష్ట్రపతి లేదా గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను న్యాయవ్యవస్థ సవరించగలదా లేదా అధిగమించగలదా?
=ఆర్టికల్ 200 కింద గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర చట్టం అమలులోకి వస్తుందా?
=సుప్రీంకోర్టులోని ఏదైనా బెంచ్ ముందుగా ఒక కేసులో గణనీయమైన రాజ్యాంగ వివరణ ఉందో లేదో నిర్ణయించి, ఆర్టికల్ 145(3) కింద ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు సూచించగలరా?