Mahaa Daily Exclusive

  తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా చేయాలని డిమాండ్ చేశాం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..!

Share

బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ, సీఎం నితీశ్ కుమార్ లపై ధ్వజమెత్తారు. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్‌లో విద్యార్థులతో ‘శిక్షా న్యాయ్ సంవాద్’ పేరిట తలపెట్టిన ముఖా ముఖి కార్యక్రమానికి వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల ఆటంకాలను అధిగమించి హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ, బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దర్భంగాలోని అంబేద్కర్ హాస్టల్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ కాన్వాయ్‌ను పోలీసులు హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయినప్పటికీ, రాహుల్ గాంధీ పట్టువీడకుండా, పోలీసుల అడ్డంకులను దాటుకుని హాస్టల్‌లోకి ప్రవేశించారు. బీహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని “డబుల్ ఇంజిన్ ధోకాబాజ్ సర్కార్” (డబుల్ ఇంజన్ మోసపూరిత ప్రభుత్వం) అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. దేశంలో అణగారిన వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందనే భయంతోనే ప్రధాని మోదీ కులగణనకు అంగీకరించారని లోక్‌సభలో అన్నారని గుర్తు చేశారకు. వెనుకబడిన వర్గాల తరఫున పోరాడుతున్న ప్రతిపక్షానికి ప్రధాని భయపడ్డారని అన్నారు.
ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా?..
బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సమావేశంలో మిథిలా యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను ఇక్కడికి రాకుండా అడ్డుకునేందుకు స్థానిక నేతలు, అధికారులు ఎంతో ప్రయత్నించారని అన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి వచ్చానని చెప్పారు. బిహార్‌లో యువతతో మమేకమయ్యేందుకు తలపెట్టిన ‘శిక్షా న్యాయ్‌ సంవాద్‌’ కార్యక్రమాన్ని రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మిథిలా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ సమావేశాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ నాయకులు, అధికారులు ఎంతో ప్రయత్నించారు. యూనివర్సిటీ గేటు బయటే నా కారును నిలిపివేశారు. అయినా, నేను వెనకడుగు వేయలేదు. నడుచుకుంటూ సభా వేదిక మీదికి చేరుకున్నాను. బిహార్‌ ప్రభుత్వం నన్ను ఎందుకు ఆపలేకపోయిందో తెలుసా? మీ అందరి అభిమానమే నన్ను ముందుకు నడిపించింది. ఇదే శక్తి నరేంద్ర మోదీని గద్దె దించుతుంది. ప్రతిపక్షాల డిమాండ్‌ మేరకే కులగణను మోదీ అంగీకరించారు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలుసు’’ అని రాహుల్‌ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కాకుండా…అంబానీ, అదానీల కోసమే పని చేస్తోందని రాహుల్‌ విమర్శించారు. కేవలం 5 శాతం మంది ప్రజల ప్రయోజనాల కోసమే మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దళితులు, ఓబీసీలు, ఆదివాసీలకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని, కార్పొరేట్‌ వ్యక్తులకే మోదీ గవర్నమెంట్‌ వత్తాసు పలుకుతోందని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న తెలంగాణలో చేపట్టిన విధంగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని, ప్రైవేటు కళాశాలలు, యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ కోసం కేటాయించిన నిధులను విడుదల చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.