మహా: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తుంటే.. కేటీఆర్ డిస్టర్బ్ చేస్తుండు అంటూ మండిపడ్డారు. కోడి గుడ్డు పైన ఈకలు పీకినట్లు బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని, సైకో రాము (కేటీఆర్) కల్లు తాగిన కోతి లాగా మాట్లాడుతుండని విమర్శించారు. రామప్ప గుడి దగ్గర అత్యుచ్చాహంతో ఎవరో ఒక అమ్మాయి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కాళ్ళు కడిగింది.. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి అన్నట్లు గొడవ చేస్తున్నారని చెప్పారు. దానికి తెలంగాణ మహిళల ఆత్మ గౌరవం ఏమైందంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి ట్వీట్ చేశారని మండిపడ్డారు. పదేళ్లు వాళ్ల ఇంటి ఆడబిడ్డ గురించి తప్ప ఏ ఇంటి ఆడబిడ్డ గురించి మాట్లాడలేదని రెడ్డి విమర్శించారు. కలెక్టర్లతో కాళ్లు కడిగించుకున్న దౌర్భాగ్య పరిస్థితి మీదని.. జనాన్ని తప్పుదోవ పట్టించాలని కేటీఆర్ రోజు ఎదో ఒకటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో దండుకున్న వందల కోట్ల రూపాయలతో కొన్ని యూట్యూబ్ చానల్స్‌తో.. మార్పింగ్ వీడియోలతో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. మంత్రి కొండా సురేఖ ఏ సందర్భంలో మాట్లాడారో దానికి ఆమె సమాధానం చెబుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.








