హైదరాబాద్, మహా: మంత్రి కొండా సురేఖ మంత్రులు కమీషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నట్లు కనిపిస్తోందని ఆయన కామెంట్స్ చేశారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలంటూ వ్యాఖ్యలు చేశారు. త్రివిద దళాలకు మద్దతుగా నేడు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. పెహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడాయని గుర్తు చేశారు. పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తలను, అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ప్రపంచంలో ఇదే తొలిసారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశ్యంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని గుర్తు చేశారు. భారత సైన్యం ఉగ్రవాదుల ఇళ్ళు, శిబిరాలు, స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిందని గుర్తు చేశారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు కూడా హతమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలోనూ అనేక ఉగ్ర ఘటనలు జరిగాయని గుర్తు చేశారు.
అబద్ధాలతో తప్పుడు ప్రచారం..
‘భారత్‌పై దాడులు చేస్తే ప్రతిదాడి కఠినంగా ఉంటుందని ఆపరేషన్ సిందూర్‌తో చెప్పాం. సుమారు 100 ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో పాటు, వారికి సహకరించే పాక్ సైనికులు కూడా చనిపోయారు. పాకిస్థాన్‌లోని భారత ఎంబసీని మూసివేసి, పాకిస్థాన్ వీసా కలిగిన వారిని దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించాం. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఖాందహార్ విమాన హైజాక్, పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర వహించిన ఉగ్రవాదులు యూసుఫ్ అజార్, అబ్దుల్ మాలిక్ రవూఫ్, ముదాసిర్ అహ్మద్ లాంటి వారిని అంతమొందించాం. పాకిస్థాన్ ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితుల్లో భారతదేశంలోని ఎయిర్ బేసులపై దాడి చేసి విమానాలను కూల్చివేశామని అబద్ధాలతో తప్పుడు ప్రచారం చేస్తోంది’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.








