Mahaa Daily Exclusive

  ఇప్పటి వరకు 49.53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ: మంత్రి ఉత్తమ్..!

Share

హైదరాబాద్, మహా: రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈసారి రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయిందనిఅన్నారు. ఈ నేపథ్యంలో ధాన్యం సేకరణను ఓ మహా యజ్ఞంలా భావిస్తూ, రైతుల నుండి ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు ధరకు ధాన్యం‌ కొనుగోలు చేస్తోందని తెలిపారు. శుక్రవారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌లతో కలిసి యాసంగి ధాన్యం సేకరణపై మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. యాసంగిలోనూ రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. 60.14 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు కాగా 129.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశామన్నారు. 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేసినట్లు తెలిపారు. 2023 రబీ సీజన్ లో మే15 నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, ఈ రబీ సీజన్ లో అదే మే 15 నాటికి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు.
యాసంగిలోనూ రికార్డు స్థాయిలో..
ముందెన్నడూ లేని విధంగా యాసంగిలో 8,348 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రైతుల అభీష్టానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ సైతం చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెస్తున్నందున కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ముఖ్యంగా లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. ధాన్యం నిల్వ చేసుకునేందుకు వీలుగా ఇంటర్మీడియట్ గిడ్డంగులను గుర్తించాలని సూచించారు. అకాల వర్షాల వల్ల ధాన్యం నిల్వలు తడిసి పోకుండా వాతావరణ పరిస్థితుల గురించి క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ముందస్తుగానే రైతులకు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలన్నారు. మరో రెండు వారాల పాటు ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగనున్న దృష్ట్యా, ఎలాంటి ఇబ్బందులకు ఆస్కారం లేకుండా సాఫీగా కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు అంకితభావంతో కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పర్యవేక్షణ జరపాలని, నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.