Mahaa Daily Exclusive

  మళ్లీ విచారణకు రండి.. మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు..!

Share

మహా: ఫార్ములా ఈ-కారు రేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు మరోసారి అనుహ్య పరిణామం ఎదురైంది. ఈ కేసులో దర్యాప్తు పెంచిన ఏసీబీ తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు సోమవారం నోటీసులు పంపారు. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు పంపడం ఇది రెండోసారి. అయితే ఫార్ములా ఈ-కార్‌ రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ పేర్లను నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డి ఉన్నారు. అది నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(A), 13(2)తో పాటు ఐపీసీ 409,120(B) సెక్షన్ల కింద నమోదు చేశారు. ఏసీబీ కేసు నమోదు చేయటంతో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎలాంటి అనుమతులు లేకుండా హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.55 కోట్లను విదేశీ సంస్థకు బదిలీ చేశారనే ఆరోపణలను అనుసరించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ మేరకు విదేశీ సంస్థతో ఒప్పందం చేసుకుంది. 2023లో తొలిసారిగా ట్యాంక్ బండ్ పై భారీ ఏర్పాట్లు చేసి ఈవెంట్ నిర్వహించారు. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీకి మంచి స్పందన కూడా వచ్చింది. ఇది సక్సెస్ కావటంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి(సెషన్‌-10) నిర్వహించేందుకు ఫార్ములా-ఈ ఆపరేషన్‌(ఎఫ్‌ఈవో)తో పురపాలక పట్టణాభివృద్ధి సంస్థ (ఎంఏయూడీ) 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
స్పందించిన కేటీఆర్
దీనిపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించే ఓ పౌరుడిగా, కేసు అంతా పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. కచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే పలు కార్యక్రమాలకు సంబంధించి లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని అన్నారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకుని.. తిరిగి వచ్చిన వెంటనే దర్యాప్తు సంస్థల ముందు అటెండ్ అవుతానని చెప్పారు. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపానని ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కనిపించింది. మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా సీఎంపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ నిలదీశారు.