Mahaa Daily Exclusive

  పుష్కరాలు సక్సెస్ వైభవంగా ముగిసిన సరస్వతీ పుష్కరాలు రాత్రి నవరత్న మాత హారతిలో పరిసమాప్తం..!

Share

మహా: భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధ్యాత్మికతతో శోభిల్లిన సరస్వతీ పుష్కరాలు ముగిసాయి. చివరి రోజు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాల కోసం వేలాదిమంది భక్తులు పోటెత్తారు. వేకువ జామునుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ 15న ప్రారంభమైన పుష్కరాల్లో లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పుణ్య స్నానాలు ఆచరించి సరస్వతి దేవికి మొక్కులు చెల్లించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అధికారికంగా నిర్వహించుకున్న పుష్కరాలు కావడంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని రూ.35 కోట్ల నిధులతో ఏర్పాట్లు చేసింది. కొన్ని పనులు సమయానికి పూర్తి కాకపోయినప్పటికీ పలు సార్లు ట్రాఫిక్ సమస్యలు ఏర్పడిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పుష్కరాలను దేవాదాయ శాఖ, ప్రభుత్వం యంత్రాంగం నిర్వహించింది.

పోటెత్తిన భక్తులు
పుష్కరాలు చివరి రోజు భక్తులు పుష్కర స్నానం ఆచరించి అధిక సంఖ్యలో ముక్తేశ్వర స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు సెల్ఫీలు, దిగుతూ శివయ్య సన్నిధిలో భక్తి పారవశ్యంతో ఉప్పొంగి పోయారు. 12 రోజులుగా గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ త్రివేణి సంగమంలో పుష్కర స్నానం, స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం త్రాగునీరు సరఫరా, త్రివేణి సంగమం వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు అధికారులు. పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది, వైద్య ఆరోగ్యశాఖ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, ఏదైనా అస్వస్థతకు గురైన భక్తులకు వైద్య సేవలు అందించారు. పంచాయతీరాజ్ విభాగం మూడు షిఫ్టుల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్ డబ్ల్యూఎస్ శాఖ ద్వారా మంచినీరు, మరుగుదొడ్ల నిర్వహణ చేశారు. విద్యుత్తు శాఖ ద్వారా నిరంతరం విద్యుత్తు సరఫరా చేశారు. సోమవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ మహా పర్వదినంలో రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకటరావు, ఈఓ మహేశ్ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సోమవారం సరస్వతి ఘాట్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దంపతులు, ప్రత్యేక స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు సంకల్పం, తర్పణం, ఆర్గ్యం, సూర్య నమస్కారాలు చేశారు. ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ బాపు సోమవారం పుష్కర స్నానం ఆచరించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు.
డ్రోన్ షో దృశ్యాలు అద్భుతం..
ఆదివారం 3.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం చివరి రోజు కావడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సరస్వతీ పుష్కరాలు ముగింపు సందర్భంగా త్రివేణి సంగమంలో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన డ్రోన్ షో భక్తులను విశేషంగా అలరించింది. త్రివేణి సంగమ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అద్భుతమైన డ్రోన్ షో దృశ్యాలను వీక్షించారు. సాయంత్రం 7:45 గంటలకు సరస్వతి ఘాట్‌లో నవరత్నమాల హారతి నిర్వహించబడింది, ఇది పుష్కరాల ముగింపును సూచించింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ నాగ ఫణిశర్మ సందేశం, వేద మంత్రోచ్ఛారణలు భక్తులను ఆకట్టుకున్నాయి. సప్త హారతులు, ప్రత్యేక కార్యక్రమాలతో ఈ ఉత్సవం వైభవంగా ముగిసింది.