మహా: సీజనల్ వ్యాధుల నివారణకు ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. సోమవారం మంత్రి కొవిడ్ వ్యాప్తి, సీజనల్ వ్యాధుల నివారణపై సెక్రటేరియట్‌లో నిపుణులు, ఉన్నత స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. ఇప్పటివరకూ ఉన్న సమాచారం, పరిశోధనల ప్రకారం కొవిడ్‌తో ఇప్పటికైతే ప్రమాదమేమీ లేదన్నారు. వివిధ దేశాల్లో అక్కడక్కడా కేసులు పెరుగుతున్నా హాస్పిటలైజేషన్ కేసులు లేవన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతూ బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పేషెంట్లు జాగ్రత్తగా ఉంటే సరిపోతుందన్నారు. సాధారణ ప్రజలు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఇప్పుడు కనిపించడం లేదన్నారు. కొవిడ్‌పై ఎక్స్‌పర్ట్స్ ఎప్పటికప్పుడు నిరంతరం పరిశోధనలు చేస్తున్నారని, సైలెంట్‌గా కేసులు పెరిగినా, క్రమంగా తగ్గుదల కూడా ఉన్నదన్నారు. కొందరిలో కొవిడ్ వచ్చి పోయిన విషయం కూడా తెలియడం లేదన్నారు. మన రాష్ట్రంలో, దేశంలో ప్రజల్లో ఇప్పటికే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చినందున పెద్దగా, కంగారు పడాల్సిన అవసరం లేదని నిపుణులు చెప్పినట్లు తెలిపారు.
సరిపడా అందుబాటులో ఉంచుకోవాలి..
రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యాయని, సీజనల్ వ్యాధులతో హాస్పిటల్లో ఓపీ, ఐపీ పెరిగే అవకాశం ఉన్నందున అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వచ్చే పేషెంట్లకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదన్నారు. అవసరమైన మందులు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్, మెడికల్ రీఏజెంట్స్ సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. శానిటేషన్, డైట్ నిర్వహణ సరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు హాస్పిటళ్లపై నిఘా పెంచాలని, డెంగీ, ప్లేట్‌లెట్స్ పేరిట ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు మొదలైనందున వానాకాలం పంటలను రైతులు ప్రారంభిస్తారని, ఈ క్రమంలో పాము, తేలు కాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుందని మంత్రి గుర్తుచేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టీచింగ్ హాస్పిటల్ వరకూ అన్ని హాస్పిటళ్లలో పాము, తేలు కాటు పేషెంట్లకు ట్రీట్‌మెంట్ అందించేందుకు అవసరమైన మెడిసిన్, ఇంజెక్షన్లు అందుబాటులోకి ఉంచుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.








